
చేపా.. చేపా.. ఎప్పుడొస్తవ్!
ఇంకా ఖరారు కాని టెండర్లు
భానుపురి (సూర్యాపేట) : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పదేళ్లుగా అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ఊసేలేకుండా పోయింది. ఈ ఏడాది జూలై వచ్చినా టెండర్లు వేయడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. దీంతో అసలు చేప పిల్లల పంపిణీ ఉంటుందా..? లేదా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదును దాటాక చేపలు పోస్తే ఎదుగుదల ఉండదని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనువైన చెరువులు, కుంటలు 1,000
జిల్లాలో చేపల పెంపకానికి అనువైన చిన్న, పెద్ద చెరువులు, కుంటలు కలిపి వెయ్యికి పైగా ఉన్నాయి. ఈ వానాకాలం తీవ్ర వర్షాభావంతో ఇప్పటివరకు చెరువులు, కుంటల్లోకి ఏమాత్రం నీళ్లు చేరలేదు. అయితే చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చేలోగా ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. సమయానికి టెండర్లు పూర్తయితే చెరువులు నిండగానే చేప పిల్లలను వదిలితే మంచి ఎదుగుదల ఉంటుంది. కానీ మూడు నాలుగు సంవత్సరాలుగా టెండర్ల ప్రక్రియ సజావుగా సాగడం లేదు. తమకు కావాల్సిన వారికి టెండర్లు దక్కేలా చేయడం కోసం ఈ ప్రక్రియను ఒకటికి రెండుసార్లు రద్దు చేసిన సంఘటనలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో టెండర్ల నిర్వహణ నుంచి పంపిణీ వరకు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించినా వీటిని అరికట్టేలా చర్యలు తీసుకోవడంలో కొంత అలసత్వం చేస్తోంది. సమయానికి పకడ్బందీగా టెండర్లు నిర్వహించాల్సి ఉండగా ఇప్పటివరకు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. టెండర్ దాఖలు నుంచి బిడ్లు ఓపెన్, టెండర్ ఖరారు, క్షేత్రస్థాయి పరిశీలన ఇలా దాదాపు నెల రోజుల పాటు సమయం వీటికే సరిపోతుంది.
ఆర్థికంగా నష్టపోతున్న మత్స్యకారులు
చెరువుల్లోకి చేప పిల్లలను వదలడం ఆలస్యం కావడంతో ఎదుగుదల సరిగా ఉండడం లేదు. అలాగే నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చేప పిల్లలను చెరువుల్లోకి వదులుతున్నారు. దీంతో మత్స్యకారులు అన్ని రకాలుగా ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండానే నష్టపోతున్నారు. ప్రధానంగా ఈ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో మధ్య దళారులే బాగుపడుతున్నారని, సామాన్య మత్స్యకారులకు ఒరిగిందేమీ లేదని చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను త్వరగా ప్రారంభించి ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు లేకుండా నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేయాలని మత్స్యకార్మిక సొసైటీలు కోరుతున్నాయి.
ఫ ఏటా టెండర్ల నుంచి పంపిణీ వరకు జాప్యం
ఫ చివరికి అదును దాటాక మొక్కుబడిగా ప్రక్రియ
ఫ చేపల్లో ఎదుగుదల లేక ఆర్థికంగా నష్టపోతున్న మత్స్యకారులు
పంపిణీచేసిన
సంవత్సరం చెరువులు చేప పిల్లలు
2022–23 579 2.43 కోట్లు
2023–24 648 3.38 కోట్లు
2024–25 315 1.01 కోట్లు
ఇంకా ఆదేశాలు రాలేదు
ఈ ఏడాది జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి సంబంధించి టెండర్ల విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టెండర్లు నిర్వహించి నాణ్యమైన చేప పిల్లలు పంపిణీ చేస్తాం. త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది.
– నాగులు నాయక్, జిల్లా మత్స్యశాఖ అధికారి

చేపా.. చేపా.. ఎప్పుడొస్తవ్!