
కదంతొక్కిన కార్మికలోకం
నెట్‌వర్క్: కార్మికలోకం కదంతొక్కింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఆర్‌టీయూ, ఐఎఫ్‌టీయూ, ఏఐకేఎంఎస్‌తో పాటు వివిధ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన సార్వత్రిక సమ్మె సూర్యాపేట జిల్లాలో విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా పలువురు కార్మిక, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. నాలుగు లేబర్‌కోడ్‌లను రద్దు చేయాలని, జీవో నంబర్ 51ని రద్దుచేసి మల్టీపర్పస్ విధానాన్ని తొలగించాలని, సమాన పనికి సమాన వేతన చట్టాన్ని అమలు చేయాలని,స్కీం వర్కర్లకు నెలకు రూ.26వేల కనీస వేతనం ఇవ్వాలని, 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతూ తీసుకొచ్చిన జీఓ నంబర్.282ను వెంటనే రద్దు చేయాలని, రైతులకు మద్దతు ధర కల్పించాలని, ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.600 ఇవ్వాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని డిమాండ్ చేశారు.
● సూర్యాపేటలో ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, ఇఫ్ట్యూ జిల్లా కార్యదర్శి గంట నాగయ్య, ఏఐటీయూసీ ప్రాంతీయ కార్యదర్శి నిమ్మల ప్రభాకర్, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ●
● సూర్యాపేట పట్టణంలో ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు ఆశా వర్కర్లు, టైలరింగ్ యూనియన్, రిక్షా కార్మికులు, హమాలీ యూనియన్, యువజన సంఘం, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఇందులో సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
● తిరుమలగిరిలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు.
● అర్వపల్లిలో హైవేపై రాస్తారోకో చేశారు.
● తుంగతుర్తి, నాగారం, నేరేడుచర్లలో ర్యాలీలు నిర్వహించారు.
● ఆత్మకూర్(ఎస్) మండలం నెమ్మికల్లులో పారిశుద్ధ్య కార్మికులు రాస్తారోకో చేశారు.
● కోదాడలో ఐక్యకార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు.
● మునగాలలో వ్యాపారసంస్థలు, పాఠశాలలు, బ్యాంకులు, మిల్లులు మూతపడ్డాయి.
● చిలుకూరు మండలంలోని సీతరాంపురంలో ఎఫ్‌సీఐ గోదాముల వద్ద సీపీఎం ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె చేశారు.
● హుజూర్‌నగర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పాల్గొన్నారు.
ఫ సార్వత్రిక సమ్మె విజయవంతం
ఫ ర్యాలీలు, రాస్తారోకోలతో హోరెత్తించిన కార్మిక, ప్రజాసంఘాల నేతలు
ఫ నాలుగు లేబర్ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్

కదంతొక్కిన కార్మికలోకం