
పోలీస్ ప్రజా భరోసా.. మంచి ఆలోచన
సూర్యాపేటటౌన్ : జిల్లాలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం నిర్వహించడం మంచి ఆలోచన అని మల్టీజోన్ –2 ఐజీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ముందుగా పోలీస్ గౌరవ వందనంతో ఐజీకి స్వాగతం పలికారు. జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో పోలీస్ అధికారులతో కలిసి ఐజీ మొక్కలు నాటారు. అనంతరం ఎస్పీతో కలిసి సీఐలు, డీఎస్పీలతో సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లా భౌగోళిక పరిస్థితులు, ప్రముఖ ప్రాంతాలు, వృత్తులు, జనాభా, రాజకీయ పరిస్థితులు, ఈ సంవత్సరంలో నమోదైన కేసుల తీరుతెన్నులు, నేరాల నివారణలో జిల్లా పోలీస్ ప్రణాళిక, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా తీసుకోబోతున్న చర్యలు, పోలీస్ ప్రజా భరోసా, ప్రజా చైతన్య కార్యక్రమాలు, కళాబృందం, షీ టీమ్స్, భరోసా టీమ్స్ పనితీరు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా ఎస్పీ నరసింహ.. ఐజీకి వివరించారు. ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ నేరాల నివారణలో ముందస్తు ప్రణాళికతో పని చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో గతంలో ఎలాంటి సమస్యలు వచ్చాయో పరిశీలించుకుని పని చేయాలన్నారు. సమస్యాత్మక విషయాలపై దృష్టి పెట్టాలని, గ్రామ పోలీస్ అధికారిని యాక్టివ్ చేసి పల్లెల్లో సమస్యలపై దృష్టి సారించాలన్నారు. చిన్న సమస్యలు కొన్ని సందర్భాల్లో తీవ్రంగా మారుతాయని, ఇలాంటి వాటిని ఆదిలోనే పరిష్కరించాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులను చైతన్య పరిచి రక్షణ కల్పించాలని, డ్రగ్స్ లాంటి వ్యసనాలకు లోను కాకుండా నిఘా ఉంచాలన్నారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ జరగకుండా విద్యాసంస్థల్లో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ కె.నరసింహ, అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరసింహా చారి, ఏవో మంజు భార్గవి పాల్గొన్నారు.
ఫ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలి
ఫ పోలీస్ అధికారుల సమావేశంలో మల్టీజోన్ –2 ఐజీ తఫ్సీర్ ఇక్బాల్

పోలీస్ ప్రజా భరోసా.. మంచి ఆలోచన