నియంతృత్వ పాలకులకు ఓటుతో బుద్ధిచెప్పాలి | Sakshi
Sakshi News home page

నియంతృత్వ పాలకులకు ఓటుతో బుద్ధిచెప్పాలి

Published Wed, Nov 15 2023 1:28 AM

భువనగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న ఆకునూరి మురళి - Sakshi

భువనగిరిటౌన్‌, ఆలేరు రూరల్‌, మోటకొండూరు: నియంతృత్వ పాలకులకు ఓటుతో బుద్ధి చెప్పాలని జాగో తెలంగాణ కన్వీనర్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక, జాగో తెలంగాణ బస్సుయాత్ర మంగళవారం భువనగిరి, ఆలేరు, మోటకొండూరు మండలాల్లో సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. మోదీ విధానాలను తొమ్మిదేళ్లుగా కేసీఆర్‌ సమర్థిస్తూ వచ్చారని ఆరోపించారు. వీరికి మతతత్వ ఎంఐఎం పార్టీ మద్దతిస్తోందన్నారు. ఈ మూడు పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ ఓట్లు, సీట్ల రాజకీయం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్‌ హామీ ఇచ్చిన కేజీ టు పీజీ అమలు కాలేదని, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు పేదలకు పంచలేదని విమర్శించారు. అందరూ చదువుకోవడం అనే కాన్సెప్ట్‌ కు బీజేపీ వ్యతిరేకమన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వ లేదని విమర్శించారు. బడా పెట్టుబడిదారులకు రూ.16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారని, అవే డబ్బులు విద్య, వైద్యానికి ఖర్చు చేస్తే అద్భుతమైన స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లు నిర్మించేవాళ్లన్నారు. కేయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ వినాయక రెడ్డి మాట్లాడుతూ గవర్న మెంట్‌ స్కీమ్‌లు కేవలం ఎమ్మెల్యేల అనుచరులు, పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్రొఫెసర్‌ పద్మజా షా, ప్రొఫెసర్‌ రమ, నైనాల గోవర్దన్‌, హన్మష్‌ ,దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌ , దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు బట్టు రామచంద్రయ్య, పీఎంసీ రాష్ట్ర కన్వీనర్‌ ఎస్‌.శివలింగం, పులి కల్పన, రాష్ట్ర అధ్యక్షుడు మామిడికాయల పరశురాం, వైఎస్‌ఆర్‌టీపీ జిల్లా అధ్యక్షుడు అతహర్‌, శ్రీనివాసాచార్యులు, హమీద్‌ , జానీ జాగో తెలంగాణ సమన్వయకర్త నైనాల గోవర్ధన్‌, ప్రొఫెసర్‌ వినాయకరెడ్డి, పద్మజషా, హన్మేష్‌, జనార్దన్‌, స్వరూప, శంకర్‌, కల్పన, పుష్ప, సౌజన్య, సంధ్య, మామిడాల పరుశరాము, చిన్నయ్య, వినయ్‌కుమార్‌, నిర్మల, ఉప్పలయ్య, స్వామి పాల్గొన్నారు.

ఫ జాగో తెలంగాణ కన్వీనర్‌ మురళి

Advertisement
Advertisement