నీడ జాడ లేక..! | - | Sakshi
Sakshi News home page

నీడ జాడ లేక..!

May 12 2026 12:32 AM | Updated on May 12 2026 12:32 AM

నీడ జాడ లేక..! బడ్జెట్‌ లేనందువల్లే..

హిరమండలం: ఉపాధి హామీ పథకం(వీబీజీ రామ్‌ జీ) వేతనదారులు మండుటెండల్లో మాడిపోతున్నారు. నీడ కరువై విలవిల్లాడిపోతున్నారు. వేసవి అలవెన్సు రాక, తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక, బిల్లులు సకాలంలో మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఎల్‌.ఎన్‌.పేటలో వడదెబ్బతో ఓ వేతనదారుడు మృత్యువాత చెందడంతో కార్మికుల్లో కలవరం మొదలైంది.

నిప్పుల కుంపటిలా..

రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఏకంగా 43 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. దీంతో ఉపాధి వేతనదారులు అవస్థలు పడుతున్నారు. సాధారణంగా పని ప్రదేశంలో గుడారాలు (టెంట్లు)వేయాల్సి ఉంటుంది. విరామ సమయంలో వేతనదారులు వీటి కిందే విశ్రాంతి తీసుకుంటారు. ఒక వేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే ఆ నీడలోనే ప్రాథమిక చికిత్స అందించడం, తర్వాత ఆస్పత్రికి తరలించడం వంటివి చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పని ప్రదేశంలో నిలువ నీడ కూడా కరువైంది. బడ్జెట్‌ లేనందువల్ల గుడారాలు ఏర్పాటు చేయలేకపోతున్నామని అధికారులే చెబుతున్నారు. ఇటీవల ఎల్‌ఎన్‌పేట మండలంలో ఓ కార్మికుడు వడదెబ్బతగిలి పని ప్రదేశంలో మృతిచెందాడు. ఈ పరిస్థితి చూసి మిగతావారు బెంబేలెత్తుతున్నారు. పనిప్రదేశంలో చాలాచోట్ల కనీసం తాగునీరు కూడా పెట్టడం లేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రథమ చికిత్స కిట్లు ఉన్నప్పటికీ వాటి జాడ కనిపించడంలేదు. గతంలో వడదెబ్బ బారిన పడకుండా మజ్జిగ ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.

వసతుల్లేవ్‌..!

ఉపాధి హామీ పథకంలో సాధారంగా వేసవి కాలంలో వేసవి అలవెన్సు కింద అదనంగా వేతనంతో కలిపి ఇస్తారు. ప్రధానంగా మార్చి, ఏప్రిల్‌, మే, జూన్‌లో ఈ అలవెన్సులు వేతనదారులకు అందిస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వేసవి అలవెన్సులు తీసేశారు. దీంతో ఉపాధి పనులపై వేతనదారుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది. గతంలో జిల్లాలో వేసవిలో రెండు లక్షల మందికి హాజరు నమోదు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య లక్ష మాత్రమే ఉన్నట్లు సమాచారం.

ఉపాధి పని జరిగే ప్రాంతాల్లో వేతనదారులకు టెంట్లు వేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది బడ్జెట్‌ లేక గుడారాలు ఏర్పాటు చేయలేకపోతున్నాం. పని ప్రదేశం వద్ద వేతనదారులు సొంతగా షెడ్‌ నిర్మించుకోవాలని సూచించాం. వసతులు ఉన్న చోటే పనులు పెట్టాలని చెప్పాం. మజ్జిగ పంపిణీ దాదాపు రెండేళ్లుగా ఇవ్వడం లేదు. వేతనాలు దశలవారీగా పడుతున్నాయి. వేతనదారుల సంఖ్య పెంచేందుకు కృషిచేస్తున్నాం.

– ఏ.శ్రీనివాసరావు, ఏపీఓ, హిరమండలం

మండుటెండలో ఉపాధి వేతనదారుల విలవిల

టెంట్లు కొనుగోలుకు బడ్జెట్‌ లేదంటున్న అధికారులు

ఇప్పటికే ఎల్‌ఎన్‌పేటలో వడదెబ్బతో ఓ వేతనదారుడు మృతి

Advertisement
 
Advertisement
Advertisement