స్మార్ట్‌మీటర్ల వినియోగదారుల్లో గందరగోళం | - | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌మీటర్ల వినియోగదారుల్లో గందరగోళం

May 7 2026 9:38 AM | Updated on May 7 2026 9:38 AM

టెక్కలి: పట్టణంలో కొంతమంది స్మార్ట్‌ మీటర్ల వినియోగదారుల్లో గందరగోళం చోటుచేసుకుంది. కమర్షియల్‌ స్మార్ట్‌ మీటర్ల వినియోగదారులకు హఠాత్తుగా విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కాలంలో ఏసీడీ చెల్లించాలని అధికారులు చెప్పారని, వాటిని చెల్లించే విషయంలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నారని పలువురు చెబుతున్నారు. కేవలం అధికారులు సాంకేతికంగా చేసిన తప్పిదాలు వల్లే ఈ పరిస్థితి చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై టెక్కలి ఏఈ వద్ద ప్రస్తావించగా.. ఏసీడీ పేరుతో కమర్షియల్‌ స్మార్ట్‌ మీటర్లకు ఎటువంటి సరఫరా ఆపలేదని చెప్పారు. కేవలం బిల్లులు చెల్లించకుండా డిఫాల్టర్‌గా ఉన్న వారికి ఆటోమేటిక్‌గా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందన్నారు. తమను సంప్రదిస్తే తక్షణమే పునరుద్ధరణ చేస్తామన్నారు.

జనావాసాల్లోకి జింక

హిరమండలం: కొండరాగోలు సమీపంలో కొండప్రాంతం నుంచి వచ్చిన జింకపిల్లను స్థానికులు రక్షించారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో జనావాసాల్లోకి రావడంతో కుక్కల గుంపు తరిమింది. వెంటనే స్థానికులు కాపాడి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ మధుసూదన్‌, సిబ్బంది చేరుకుని జింక పిల్లకు సపర్యలు చేసి అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సస్పెన్షన్‌

ఎచ్చెర్ల : బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థినితో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతూ వేధింపులకు పాల్పడిన కాంట్రాక్ట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మజ్జి రామారావును సస్పెండ్‌ చేస్తూ రిజిస్ట్రార్‌ బిడ్డిక అడ్డయ్య బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. సోషల్‌మీడియాలో ఆడియో హల్‌చల్‌ చేయడం, మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణకు ప్రత్యేక కమిటీ నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పోటీపరీక్షలకు

ఉచిత శిక్షణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు అసిస్టెంట్‌ లోకో పైలట్‌, గ్రూప్‌–డి, ఏపీ హైకోర్టు – 2026 రిక్రూట్‌మెంట్‌ పరీక్షలకు జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 100 మంది అభ్యర్థులకు రెండు నెలలపాటు ఉచిత శిక్షణ, స్టైఫండ్‌, స్టడీ మెటీరియల్‌ అందజేయనన్నట్లు పేర్కొన్నారు. పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. టెన్త్‌, డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తామని చెప్పారు. ఈ నెల 25 నుంచి తరగతులు మొదలవుతాయని పేర్కొన్నారు.

అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 20లోగా బీసీ స్టడీ సర్కిల్‌, ఎన్టీఆర్‌ భవన్‌, 80 ఫీట్‌ రోడ్డు, వాంబే కాలనీ, శ్రీకాకుళం కార్యాలయంలో అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 8332852106 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

డీవీఈఓగా కృష్ణవేణి

శ్రీకాకుళం న్యూకాలనీ: ఇంటర్మీడియెట్‌ విద్య జిల్లా అధికారిగా సీనియర్‌ ప్రిన్సిపాల్‌ మొదలవలస కృష్ణవేణి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈమె శ్రీకాకుళం ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుత డీవీఈఓగా పనిచేస్తున్న రేగ సురేష్‌కుమార్‌ అనారోగ్య కారణాలతో రెండు నెలలు సెలవులో ఉన్నారు. కృష్ణవేణి ఆర్‌ఐఓగా కూడా వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రిన్సిపాళ్లు, లెక్చరర్ల సహకారంతో సప్లిమెంటరీ పరీక్షలను, స్పాట్‌ వాల్యుయేషన్‌ పూర్తిచేస్తామని తెలిపారు. ప్రవేశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement