తరగతుల నిర్వహణకు రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

తరగతుల నిర్వహణకు రాతపూర్వక ఉత్తర్వులు ఇవ్వాలి

May 6 2026 8:55 AM | Updated on May 6 2026 8:55 AM

ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యవర్గ ఎన్నిక

శ్రీకాకుళం : పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శిక్షణ ఇచ్చే నిమిత్తం ఉపాధ్యాయులను ప్రతిరోజు పాఠశాలలకు వెళ్లాల్సిందిగా వాట్సాప్‌ మెసేజ్‌లు, ఆన్‌లైన్‌ సమావేశాల్లో ప్రధానోపాధ్యాయుల ద్వారా ఉపాధ్యాయులపై రాష్ట్ర, జిల్లా అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, ఈ విషయంలో ప్రొసీడింగ్స్‌ రూపంలో ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చావలి శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పప్పల తిరుమలరావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏ విధమైన ఉత్తర్వులు ఇవ్వకుండా మౌఖిక ఆదేశాల ద్వారా ఉపాధ్యాయులతో వేసవి సెలవులలో క్లాసుల నిర్వహణ చేయించడం సమంజసం కాదన్నారు. రెమీడియల్‌ క్లాసుల నిమిత్తం పాఠశాలకు వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ఏర్పాట్లు కూడా చేస్తూ ఉత్తర్వులు ఇప్పించాలని కోరారు.

బొలెరో ఢీకొని ఇద్దరికి గాయాలు

మందస: బాలిగాం సమీపంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాశీబుగ్గ, కోట బొమ్మాళికి చెందిన టి.శ్రీనివాసరావు, ఎన్‌.ధనలక్ష్మి బంధువులు. మందస మండలం సొండిపూడి గ్రామంలో బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరై తిరిగి బైక్‌ వస్తుండగా బాలిగాం జాతీయ రహదారిపై కోళ్లు రవాణా చేస్తున్నా బొలెరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాసరావు, ధనలక్ష్మిలు తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని హరిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మందస ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ తెలిపారు.

సూర్యనారాయణ నేత్రాలు సజీవం

శ్రీకాకుళం కల్చరల్‌ : హయాతినగరానికి చెందిన ముగుల సూర్యనారాయణ (85) మృతి చెందడంతో ఆయన నేత్రాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఫణికిరణ్‌ తదితరులు నిర్ణయించారు. విషయాన్ని రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ పి.జగన్మోహనరావుకు తెలియజేయడంతో మగటపల్లి కల్యాణ్‌ నేత్ర సేకరణ కేంద్రం సిబ్బంది పి.సుజాత, ఎం.ఉమాశంకర్‌లు కార్నియాలను సేకరించి విశాఖపట్నం తరలించారు.

సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో అధికారులు ఏమాత్రం అలసత్వం వహించినా సహించేది లేదని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి మండల స్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలపై దిశా నిర్దేశం చేశారు. పింఛన్లు, గృహ నిర్మాణం, ఉపాధి హామీ పథకం అమలులో జిల్లా మెరుగైన స్థానంలో ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరి ఓం పాండియా, డీఆర్‌ఓ ఇన్‌చార్జి పద్మావతి, సీపీఓ ప్రసన్నలక్ష్మి, డీఎంహెచ్‌ఓ అనిత, ఆర్డీఓలు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.

శ్రీకాకుళం: ఏపీటీఎఫ్‌ కౌన్సిల్‌ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో మంగళవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం.భుజంగరావు, ప్రధాన కార్యదర్శిగా బుక్కూరు వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షుడిగా టెంక చలపతిరావు, అదనపు కార్యదర్శిగా పి.బాలాజీరావు, సహాధ్యక్షులుగా అనంతాచార్యులు, ఉపాధ్యక్షులుగా వై.వి.రమణ, బి.వి.ఎన్‌.జితేంద్ర, బి.నవీన్‌, బి.ధర్మారావు, కార్యదర్శులుగా వి.శ్రీనివాసరావు, బి.చిన్నారావు, కిరణ్‌కుమార్‌, టి.జోగారావు, బి.కృష్ణారావు, ఎం.రమణారావును ఎన్నుకున్నారు. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర సహాధ్యక్షుడు చింతాడ దిలీప్‌కుమార్‌, ఎన్నికల అధికారిగా ఈశ్వరరావు, మధుసూదనరావు పాల్గొన్నారు.

నైపుణ్యాలతోనే సుస్థిర అభివృద్ధి

ఎచ్చెర్ల : యువత నైపుణ్యాభివృద్ధితోనే ఉద్యోగ ఉపాధి కల్పన జరిగి స్థిరమైన అభివృద్ది సాధ్యపడుతుందని పీయూసీ చైర్మన్‌, ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. ఎచ్చెర్ల మండల కేంద్రంలోని యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలో 45 రోజులు శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు మంగళవారం ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతిఒక్కరూ నైపుణ్యాలను పెంపొందించుకుని నైపుణ్యవంతమైన మానవ వనరులుగా తయారుకావాలన్నారు. కార్యక్రమంలో ఎల్‌డీఎం పేడాడ శ్రీనివాసరావు, శిక్షణ సంస్థ డైరెక్టర్‌ ఎన్‌.రామ్‌జీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement