చెరువులో పడి వృద్ధుడు మృతి
రణస్థలం: లావేరు మండలం చిగురుకొత్తపల్లి గ్రామానికి చెందిన గిడుతూరి అప్పారావు మతిస్థిమితం లేని కారణంగా చెరువులో పడి మృతి చెందినట్లు లావేరు పోలీసులు తెలిపారు. ఈ నెల 1వ తేది రాత్రి 8గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వృద్ధుడు తిరిగి రాలేదు. శనివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో ఉన్న చెరువు నుంచి దుర్వాసన రావడం, కొద్దిసేపటికే మృతదేహం తేలడంతో పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. గ్రామస్తులు పరిశీలించి గిడుతూరి అప్పారావుగా గుర్తించారు. మృతుడి కుమారుడు గిడుతూరి సూరప్పడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లావేరు ఏఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


