ఇదేం తీరు!
● ‘పది’ పరీక్షలపై సర్కారు ఏకపక్ష నిర్ణయాలు
● జిల్లా అధికారులను డమ్మీ చేసేలా నియంతృత్వ పోకడలు
● మండిపడుతున్న ఉపాధ్యాయులు
శ్రీకాకుళం :
పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ విషయమై ప్రభుత్వం అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలపై ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుండటం పట్ల ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. టెన్త్ విద్యార్థులకు 2026 మార్చి 16 నుంచి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించడం విదితమే. తాజాగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నిర్వహించిన వెబెక్స్ మీటింగ్‌లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం కేంద్రీకృతంగా నిర్వహించనున్నట్లు చెప్పడం కొత్త సంప్రదాయానికి తెరలేపినట్టు అయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వింత పోకడలు ప్రస్తుత విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రదర్శించడం సురక్షిత, పారదర్శకమైన పరీక్షల విధానాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నీ అక్కడి నుంచే..
జిల్లాస్థాయి, క్షేత్రస్థాయి అధికారులను డమ్మీలుగా చేయడమే ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. వారి అధికారాలను, రూల్స్ ప్రవిన్సులైజేషన్ ద్వారా సంక్రమించిన విధులను, బాధ్యతలను కూడా రాష్ట్రస్థాయి అధికారులు హస్తగతం చేసుకోవడం పని విభజన సంస్కృతిని కాలరాయడమేనని జిల్లా అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఆలోచనలు మండల విద్యాశాఖ అధికారుల విధులు, బాధ్యతలను నిర్వీర్యం చేస్తున్నాయి. మండలానికి రెండు లేదా మూడు పరీక్ష కేంద్రాలు ఉంటే ఆ పరీక్షా కేంద్రాల పరిధిలో ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రైవేటు యాజమాన్యాల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అవే కేంద్రాల్లో పరీక్ష రాయవలసి ఉంటుంది. ఇటువంటి సమయాల్లో స్థానిక అధికారులు నిర్ణయాలు తీసుకుంటూ ఇన్విజిలేషన్ డ్యూటీలు, బాధ్యతలు వంటి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ప్రభుత్వం తాజా ఆలోచనల ప్రకారం పాఠశాల విద్యాశాఖ కేంద్ర కార్యాలయమే నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రస్థాయి అధికారులే ఇన్విజిలేషన్ విధులను కేటాయిస్తే పలుచోట్ల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు బోధించిన పాఠశాల విద్యార్థులు కూడా ఒకే కేంద్రంలో ఉండే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించే అవకాశముంది.
మినహాయింపు లేకుంటే ఎలా..?
వైద్య అనారోగ్య కారణాలతో మినహాయింపులకు అవకాశం లేకుండా చేస్తే తమ ప్రాణాలను ఫణంగా పెట్టడమేనని ఉపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. ప్రతి జిల్లాలోనూ 10వ తరగతి పరీక్షల నిర్వహణ మూల్యాంకన పత్రాల స్ట్రాంగ్ రూములు, మూల్యాంకన పత్రాలను వేరే జిల్లాలకు పంపించడం ఇతర జిల్లాల నుంచి రాష్ట్రస్థాయి అధికారులు కేటాయించిన జిల్లా నుండి మూల్యాంకన పత్రాలను రిసీవ్ చేసుకోవడం వంటి నిధులు అసిస్టెంట్ కమిషనర్ నిర్వర్తించేవారు. ఈ పోస్టును సైతం లేపేసే కుట్రలకు చంద్రబాబు సర్కారు తెరతీస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత పెంపుకోసం అమలు చేస్తున్న వందరోజుల యాక్షన్ ప్లాన్ సెలవు రోజుల్లోనూ ఉండడం వల్ల విద్యార్థులు మానసిక సంఘర్షణలకు గురవుతున్నారని, వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు.


