రబీలో ఆరుతడే మేలు
శ్రీకాకుళం: రబీలో వరి పంట తప్ప వేరుశనగ, ఇతర పంటలను రైతులు వేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలసి ఆయన నిర్వహించారు. 3 నెలలకు ఒకసారి ఇరిగేషన్ బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించి శాసన సభ్యులను ఆహ్వానించి సంబంధిత అధికారులను పిలవాలన్నారు. ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి గండ్లు గుర్తించాలని సూచించారు. ఫిబ్రవరి నాటికి వంశధార ప్రాజెక్టులో ఉన్న నీరు ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని, బ్యారేజీ పాడైనందున బాగు చేయాల్సి ఉంటుందన్నారు. ఇరిగేషన్ ఎస్‌ఈ నాగావళి, వంశధార, నారాయణపురం బ్యారేజీల నుంచి అందిస్తున్న నీటి వివరాలను వివరించారు. వంశధార స్టేజ్–2 భూసేకరణకు సంబంధించి 28 ఎకరాలకు నష్ట పరిహారం ఎంత ఇవ్వాలో అప్‌లోడ్ చేయాలన్నారు. ఎమ్మెల్యే కూన రవి కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో ఉన్న కాలువల ద్వారా వచ్చే మురుగు నీరు, చెత్త సాగునీటి కాలువల్లోకి రాకుండా చూడాలని కోరారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌పై ప్రతి మూడు నెలలకు సమీక్ష నిర్వహించాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తే సమస్యలు ఉంటే పరిష్కారం చేయవచ్చన్నారు. సమావేశంలో శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్, వంశధార ప్రాజెక్టు ఛైర్మన్ ఎ. రవీంద్రబాబు, నారాయణపురం ప్రాజెక్టు ఛైర్మన్ సనపల డిల్లీరావు, ఆర్డీఓలు కె. సాయి ప్రత్యూష, కష్ణమూర్తి, వెంకటేష్, వంశధార డిప్యూటీ కలెక్టర్ జి.జయదేవి తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో కొందరు అధికారులపై ఎమ్మెల్యే కూన రవి అసంతృప్తి వ్యక్తం చేశారు. డీఈ పనితీరు అస్సలు బాగోలేదని అన్నారు.


