హోంగార్డుల సంక్షేమానికి కృషి
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు వ్యవస్థలో హోంగార్డులు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అన్నారు. తండేవలస జిల్లా పోలీసు శిక్షణాకేంద్రం మైదానంలో శనివారం నిర్వహించిన 63వ హోంగార్డు ఆవిర్భావ దినోత్సవంలో ఎస్పీ పాల్గొన్నారు. ముందుగా పరేడ్ కమాండర్ హోంగార్డు శశిభూషణ్ గౌరవ వందనాన్ని సమర్పించగా రైజింగ్‌పరేడ్‌ను ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1962లో కొద్దిమందితో ఏర్పడిన హోంగార్డుల ఆర్గనైజేషన్ జిల్లాలో నేడు 699 మందికి చేరుకుందన్నారు. పండగలు, ట్రాఫిక్ నియంత్రణ, విపత్తుల సహాయక చర్యలు, బందోబస్తు, ఎన్నికలు, ర్యాలీలు, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమన్నారు. వేతనం పెంచే ఆలోచనలో ప్రభుత్వముందని, ఆరోగ్య రక్షణ కోసం హెల్త్ ప్రమాద బీమా, ప్రతినెలా 2 రోజుల విశ్రాంతి సెలవులకు తోడు అత్యవసర పరిస్థితుల్లో సెలవులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ వివేకానంద, సీఐలు, ఎస్‌ఐలు, అధికసంఖ్యలో హోంగార్డులు పాల్గొన్నారు.


