ఫోన్ ఎందుకు కొన్నావని మందలించినందుకు..
● జె.ఆర్.పురంలో బాలుడు అదృశ్యం
రణస్థలం: ఇంట్లో తెలియకుండా సెల్‌ఫోన్ కొనుగోలు చేసిన కుమారుడిని తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన దంగుడుబియ్యపు టోనీష్ అనే విద్యార్థి ఇంట్లో నుంచి పారిపోయాడు. జె.ఆర్.పురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావేరు మండలం పాత కుంకాం గ్రామానికి చెందిన సతీష్ వృత్తిరీత్యా జె.ఆర్.పురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. కుమారుడు టోనీష్ ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల తల్లిదండ్రులకు తెలియకుండా డబ్బులు దాచి సెల్‌ఫోన్ కొనుక్కున్నాడు. టోనీష్ వద్ద సెల్ ఉందని, తలగడ కింద పెట్టుకుని వాడుతున్నాడని తల్లి గమనించింది. వెంటనే భర్త సతీష్‌కు చెప్పింది. ఇంట్లో తల్లిదండ్రులు మందలించడంతో శనివారం ఉదయం పాఠశాలకు బయలుదేరిన టోనీష్ సైకిల్, బ్యాగ్ ప్రైవేటు స్కూల్ సమీపంలో ఉంచేసి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు అన్నిచోట్లా వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆచూకీ తెలిస్తే 9842302369, 9000519420 నంబర్లకు తెలియజేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


