విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విద్యార్థుల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్‌రావు డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో రెండు రోజులుగా జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ 44వ జిల్లా మహాసభలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెప్‌ని రద్దు చేయాలని, మూసేసిన పాఠశాలలను తెరిపించాలని, సంక్షేమ వసతిగృహాలకు సొంత భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. విద్యా సంస్థలకు వెళ్లేందుకు విద్యార్థి సంఘాలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలన్నారు. అనంతరం నూతన కమిటీను ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా డి.చందు, పి.ఖగేష్, జిల్లా గర్‌ల్స్ కన్వీనర్‌గా దివ్య, కార్యవర్గ సభ్యులుగా చిన్న దుర్గాప్రసాద్, రాములను ఎన్నుకున్నారు.


