దుకాణాల్లో గంజాయి తనిఖీలు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు ఇలాకాలో గురు, శుక్రవారాల్లో గంజాయి తనిఖీలు విస్తృతంగా జరిగాయి. నిమ్మాడ కూడలి, కోటబొమ్మాళి కేంద్రాలుగా గంజాయి విస్తరిస్తుందన్న వార్తలు గుప్పుమనడంతో ఇటీవల సాక్షిలో వచ్చిన ‘గ్రానైట్ క్వారీలే గంజాయి అడ్డాలు’ కథనానికి ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి స్పందించారు. ఈ మేరకు టెక్కలి డీఎస్పీ దాసరి లక్ష్మణరావుకి గంజాయి సరఫరా, క్రయ, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం సాయంత్రం, శుక్రవారం నిమ్మాడ కూడలి, పెద్దబమ్మిడి, ఎత్తురాళ్లపాడు పరిధిలోని జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కిరాణా షాపుల్లో పోలీసు జాగిలాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. అంతేకాక సమీపంలో ఉన్న హరిశ్చంద్రపురం, తిలారు రైల్వే స్టేషన్లే కాక గ్రానైట్ పరిశ్రమలపై ప్రత్యేక నిఘా పెట్టారు. హైవే వెంబడి వాహనాల రాకపోకలపై రాత్రి వేళల్లో పెట్రోల్‌మొబైల్ వాహనాలతో తనిఖీలు చేశారు. ఇటీవల జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని జాతీయ రహదారిపై భారీ వాహనాలను సైతం అధిక సమయం నిలుపుదల చేయకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చర్యలు తీసుకుంటున్నారు. ‘సాక్షి’లో వచ్చిన కథనానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, అచ్చెన్నాయుడులు గంజాయి నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.
నిమ్మాడ కూడలి, కోటబొమ్మాళి
కేంద్రాలుగా పలు షాపుల్లో పోలీసు జాగిలాలతో తనిఖీలు
రైల్వేస్టేషన్లు, గ్రానైట్ పరిశ్రమలు, వాహనాలపై ప్రత్యేక నిఘా
‘సాక్షి’లో వచ్చిన కథనంతో ఎస్పీ కీలక ఆదేశాలు
దుకాణాల్లో గంజాయి తనిఖీలు
దుకాణాల్లో గంజాయి తనిఖీలు


