దాతలే దిక్కు!
● కాలేయ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి సింధునందన్
● లివర్ మార్పిడికి రూ.25 లక్షలు అవసరం
● దాతల కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు
ఎచ్చెర్ల : ఐదేళ్ల వయసులో ఆటపాటలతో సందడి ఉండాల్సిన ఆ ఇల్లు తీవ్ర నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోంది. కుమారుడు ప్రాణాంతక సమస్యతో బాధపడుతుండటం, చికిత్సకు లక్షల రూపాయలు అవసరం కావడంతో తల్లిదండ్రులు దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామానికి చెందిన దంపతులు రాము, ధనలక్ష్మీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు ఐదేళ్ల సింధు నందన్ కొంతకాలంగా కాలేయ సమస్యతో బాధపడుతున్నాడు. వ్యాధి తీవ్రం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ప్రాణం నిలబెట్టడానికి లివర్ మార్పిడి తప్పనిసరి అని, ఇందుకు రూ.25 లక్షలు వరకు ఖర్చు అవుతుందని తేల్చిచెప్పారు. చిన్నారికి త్వరగా చికిత్స చేసి లివర్ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. రోజురోజుకు చిన్నారి ఆరోగ్యం క్షీణిస్తుండటంతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కూలీ పనులను చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తాము ఇంత సొమ్మును ఎలా తీసుకురావాలో తెలియక విలవిల్లాడుతున్నారు. దాతలే స్పందించి తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.


