భారత దివ్యాంగుల త్రోబాల్ జట్టుకు రామకృష్ణ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు బగ్గు రామకృష్ణ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక వేదికగా జరగనున్న సౌత్ ఏషియన్ త్రోబాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనే భారత దివ్యాంగుల పురుషుల జట్టుకు ఎంపికయ్యాడు. బలగలో నివాసం ఉంటున్న రామకృష్ణ చిన్నప్పుడే పోలియోబారిన పడ్డాడు. క్రికెట్‌తోపాటు త్రోబాల్ గేమ్‌లోనూ పట్టుసాధించాడు. చైన్నె వేదికగా ఇటీవల జరిగిన జాతీయ త్రోబాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు బంగారు పతకంతో రాణించడంలో రామకృష్ణ కీలకభూమిక పోషించాడు. దీంతో జాతీయ జట్టుకు ఎంపికచేశారు. ఈ సందర్భంగా రామకృష్ణను జిల్లా దివ్యాంగుల క్రీడా సంఘ చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి శుక్రవారం అభినందించి ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో కోచ్ జి.అర్జున్‌రావురెడ్డి, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
పొందూరులో దొంగలు హల్‌చల్
పొందూరు: పొందూరు పట్టణంలో గురువారం రాత్రి దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసిన రెండిళ్లలో చోరీలకు పాల్పడ్డారు. గాంధీనగర్ మొదటి వీధిలో మాడుగుల లక్ష్మి ఇంట్లో తులం బంగారు గొలుసు, రూ.లక్ష నగదు, వెండి వస్తువులు దొంగిలించారు. లక్ష్మి తన భర్త అనారోగ్యం కారణంగా వైద్యం కోసం విశాఖపట్నం వెళ్లారు. ఇదే అదనుగా దొంగలు ఇంటి తాళం పగులకొట్టి సొత్తు దోచుకున్నారు. గాంధీనగర్ రెండో వీధిలో ఎచ్చెర్ల పైడి రాజు ఇంట్లో అర తులం బంగారం, ఏడు తులాల వెండి వస్తువులు దొంగిలించారు. పైడిరాజు కుటుంబం విశాఖపట్నంలోని ఓ ఫంక్షన్‌కు వెళ్లకు ఈ చోరీకి పాల్పడ్డారు. గాంధీనగర్–2లో పేకల లక్ష్మి హైదరాబాద్‌లోని తన కుమారుడి వద్దకు ఇటీవల వెళ్లారు. ఆమె ఇంటి తాళం సైతం పగలకొట్టి ఉండటంతో బంధువులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఆమె తిరిగి వచ్చాక చోరీ వివరాలు తెలియాల్సి ఉంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై వి.సత్యనారాయణ కేసు నమోదు చేశారు. శుక్రవారం ఉదయం క్లూస్‌టీం వెంటి వేలిముద్రలను సేకరించారు. సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు.
భారత దివ్యాంగుల త్రోబాల్ జట్టుకు రామకృష్ణ


