ఆహారమే ఔషధం కావాలి
శ్రీకాకుళం కల్చరల్: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ భూమిని, రైతును, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ నెల 9 నుంచి మూడురోజుల పాటు శ్రీకాకుళం అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్, వివిధ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బృందావన్ ఫంక్షన్ హాలులో నిర్వహించే సిక్కోలు హరిత మహోత్సవం, శుక్రవారం ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ రసాయనాలు లేని ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ఆరోగ్యం, పర్యావరణం, సంప్రదాయం కాపాడుకుందామన్నారు. పీడియాట్రిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ ఆహారమే ఔషధం కావాలి, లేకపోతే ఔషధమే ఆహారం అవుతుందని, మహిళలందరూ వంటింట్లో మళ్లీ చిరుధాన్యాల వినియోగం పెంచాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, యార్లగడ్డ గీతాశ్రీకాంత్, వినోద్‌కుమార్, విజయకుమార్, సచిత్ర, అన్నపూర్ణ, రవి, ప్రవీణ్, షర్మిళ పాల్గొన్నారు.


