వ్యవసాయ శాఖ పేషీని అవినీతిమయం చేశారు
● మంత్రి అచ్చెన్నాయుడిపై తిలక్ మండిపాటు
టెక్కలి: వ్యవసాయం దండగ అని గత టీడీపీ పాలనలో చంద్రబాబు నిర్లక్ష్యంగా మాట్లాడిన సంగతి గుర్తు లేక తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గత వైఎస్సార్‌సీపీ పాలనలో వ్యవసాయరంగం పూర్తిగా నాశనమైపోయిందంటూ మతిభ్రమించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ మండిపడ్డారు. శుక్రవారం టెక్కలి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే పేషీని అవినీతిమయం చేసిన అచ్చెన్నాయుడు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయరంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులపై విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయించలేని చేతకాని మంత్రిగా మిగిలిపోతున్నారని విమర్శించారు. సొంత నియోజకవర్గంలో రైతులకు విత్తనాలు, యూరియా ఇవ్వలేని అసమర్ధత మంత్రిగా మిగిలిపోయారన్నారు. మోంథా తుఫాన్ బాధిత రైతుల్లో ఎంత మందికి పరిహారం ఇచ్చారో బహిరంగంగా చెప్పా లని డిమాండ్ చేశారు. కళ్లాల్లో ధాన్యం నిల్వలతో అమ్మకాల కోసం ఎదురుచూస్తున్న రైతులకు న్యాయం చేయకుండా మిల్లర్లు, దళారీలకు మద్దతు ఇస్తూ కమీషన్‌లకు మంత్రి కక్కుర్తి పడుతున్నారని మండిపడ్డారు. స్వాతంత్య్రం అనంతరం ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ బడులకు నాడు–నేడుతో సరికొత్త రూపం ఇచ్చిన నాయకుడు వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నాశనం చేసి పేరెంట్స్ మీటింగ్ అంటూ ఆర్భాటంగా ప్రచారాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.


