సీఐటీయూ నాయకుడు కొండయ్య మృతి
ఆమదాలవలస: జిల్లా సీఐటీయూ సీనియర్ నాయకుడు మెట్ట కొండయ్య (84) కొంతకాలంగా అనారోగ్యానికి గురై బుధవారం ఉదయం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మండలంలోని కొత్తవలస గ్రామానికి చెందిన కొండయ్య పట్టణంలోని సహకార చక్కెర కర్మాగారంలో కార్మికుల హక్కుల కోసం దశాబ్ధాల పాటు పోరాటం చేశారు. కొంతకాలం కొత్తవలస గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. చక్కెర కర్మాగారంలో ఉద్యోగిగా పనిచేసే సమయంలో పట్టణంలోని కొత్తకోట వారి వీధిలో నివాసం ఏర్పాటు చేసుకొని స్థిరపడ్డారు. కొండయ్యకు భార్య రాజేశ్వరి, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొండయ్య భౌతిక దేహంపై సీఐటీయూ జెండాను కప్పి కార్మిక సంఘ, వామపక్ష నేతలు గౌరవ నివాళులర్పించారు. జిల్లా సీనియర్ నాయకులలో ఒకరైన కొండయ్య మృతిపై పలు కార్మిక సంఘాల నాయకులు, వామపక్ష నేతలు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


