ప్రసవ వేదన..!
సెల్‌ఫోన్లు పనిచేయడం లేదు
నమోదు చేస్తున్నాం
ప్రయోజనానికి..
● మాతృవందనం నమోదుకు అవస్థలు ● సక్రమంగా పనిచేయని సెల్‌ఫోన్లు ● ఇబ్బందులు పడుతున్న అంగన్‌వాడీ టీచర్లు
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో ప్రధానమంత్రి మాతృవందన యోజన(పీఎంఎంపీవై) అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. సర్వర్‌తో పాటు సెల్‌ఫోన్‌లో సాంకేతిక కారణాలతో గర్భిణులు, నవజాత శిశువుల వివరాల నమోదు అరకొరగానే సాగుతోంది. జిల్లాలో నేటి వరకు కేవలం 22,400 మంది లబ్ధిదారులకు మాత్రమే ఎన్‌రోల్‌మెంట్ చేశారు. అందులో కేవలం 2,600 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. మిగతా వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మరోపక్క పీఎంఎంపీవై నమోదుకు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో అంగన్‌వాడీ టీచర్లు తలలు పట్టుకుంటున్నారు.
మొదటి కాన్పుకు రూ.5 వేలు
మాతృ వందనం పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన మహిళలు గర్భం దాల్చే సమయంలో, బిడ్డకు జన్మనిచ్చిన సమయంలో పోషకాహారం, మందుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. మొదటి కాన్పు అయితే వారి బ్యాంక్ ఖాతాలో రూ.5 వేలు జమ చేస్తుంది. అందులో భాగంగానే గర్భిణీగా నమోదు చేసుకున్న సమయంలో రూ.1,000లు, బిడ్డ జన్మించినప్పుడు రూ.2 వేలు, బిడ్డకు టీకాలు వేసే సమయంలో మరో రూ.2 వేలు అందిస్తారు. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే మరో రూ.6 వేలు జమ చేస్తారు.
అరకొరగానే నమోదు
మాతృ వందనం పథకం అమలు కోసం ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని కొందరు సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. వారు మరికొందరి అంగన్‌వాడీ టీచర్లకు తర్ఫీదు ఇచ్చారు. వారి ద్వారా అంగన్‌వాడీ సెంటర్లకు చెందిన టీచర్లు తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లలో యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకొని లబ్ధిదారుల వివరాలు నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లతో పాటు తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్ల ద్వారా సైతం వివరాల నమోదు కోసం ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు. సర్వర్‌తో పాటు సెల్‌ఫోన్‌లోని సాంకేతిక కారణాల వలన అంగన్‌వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంగన్‌వాడీ సెంటర్లలోని రొటీన్ పనులను పక్కనబెట్టి సెల్‌ఫోన్లతో కుస్తీ పడుతున్నా గర్భిణులు, నవజాత శిశువుల నమోదు అరకొరగానే జరుగుతోంది.
లబ్ధిదారుల ఎదురుచూపు
జిల్లాలో పెద్ద సంఖ్యలో గర్భిణులు మాతృ వందనం పథకం కింద అందే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నుంచి వైద్యశాఖ నుంచి సమగ్ర శిశు సంక్షేమ శాఖకు బదలాయించింది. ఇప్పటికే పలు యాప్‌లతో పనిభారం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని, నూతన బాధ్యతలు తలకుమించిన భారం అయ్యాయని అంగన్‌వాడీ టీచర్లు వాపోతున్నారు. సక్రమంగా పనిచేయని సెల్‌ఫోన్లతో ఉన్న యాప్‌లకు తోడు మాతృవందన యోజన పథకం కింద అదనంగా వచ్చిన యాప్‌తో ఎలా వివరాలు నమోదు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 0
ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం నమోదు కార్యక్రమం గతంలో హెల్త్ వర్కర్లు చేసేవారు. ఇప్పుడు అంగన్‌వాడీ టీచర్లకు యాప్‌లో నమోదు చేయమని చెబుతున్నారు. దీనికి సంబంధించిన శిక్షణ ఇవ్వలేదు. సెల్‌ఫోన్లు ఈ యాప్‌కు సపోర్ట్ చేయడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుస్తీ పడితే ఒకరిద్దరి వివరాలు నమోదు చేయడం కష్టంగా ఉంది. సూపర్‌వైజర్లు మాత్రం టీచర్లపై ఒత్తిడి తెస్తున్నారు. యాప్‌పై వెంటనే శిక్షణ ఇవ్వాలి. సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి.
– కె.కల్యాణి, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు
ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద అర్హులైన అందరినీ నమోదు చేస్తున్నాం. యాప్‌లు సక్రమంగా పనిచేయడం లేదని మా దృష్టికి వచ్చింది. త్వరలోనే కొత్త ఫోన్లు ఇస్తాం. దీంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం అయ్యేందుకు కృషిచేస్తాం.
– ఐ.విమల, ఐసీడీఎస్ పీడీ
ప్రసవ వేదన..!
ప్రసవ వేదన..!


