● ఇండియన్ నేవీలో సేవలందించిన సిక్కోలు నావికులు ● సాగరం
సాహసమే శ్వాసగా..!
సముద్రపు గాలులు శరీరాన్ని బలంగా తాకుతున్నా.. సరిహద్దు రేఖలు కంటికి కనిపించని చోట వారు గస్తీ కాస్తారు. కడలి ఘోషకే ఒళ్లు జలదరించే అనంత జలనిధిలో దేశంలోకి శత్రువు ప్రవేశించకుండా అడ్డుగోడగా నిలుస్తారు. నౌకల్లో కడలి నలువైపులా తిరుగుతూ అనుక్షణం దేశ రక్షణలో తలమునకలై ఉంటారు. వారే మన నావికులు. జిల్లాలోని నావికాదళంలో పనిచేసిన వారు వందల్లో ఉన్నారు. గురువారం నేవీ డే పురస్కరించుకొని మాజీ నావికా దళ ఉద్యోగులను సాక్షి పలకరించింది. – సాక్షి కల్చరల్
ఐఎన్‌ఎస్ విక్రాంత్ అనేది చాలా పెద్ద విమాన వాహక నౌక. అందులో రెండేళ్ల ఆరుమాసాలు ఉన్నాను. దాని మీద 13 డెక్‌లు ఉండేవి. వాటిపై యుద్ధ విమానాలు, హెలీకాఫ్టర్లు ఉండేవి. ఆపరేషన్ సమయాల్లో సీఆర్‌ఏ ఫైరింగ్ చేసేటప్పుడు.. కదులుతున్న నౌక నుంచి టార్గెట్‌ను ఫైర్ చేయడం చాలా అద్భుతంగా అనిపించేది. షిప్‌లో న్యూక్లియర్ డిఫెన్స్ కూడా ఉండేది. 15 ఏళ్ల పాటు దేశానికి సేవలు అందించాను. దేశానికి సేవ చేయడం ఒక గొప్ప అనుభూతి.
– మల్లిపెద్ది కిరణ్‌కుమార్,
విశ్రాంత నేవీ అధికారి
జిల్లా మాజీ సైనికుల సమాఖ్య ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీన శ్రీకాకుళం నగరంలో నేవీ డే వేడుకలు నిర్వహించనున్నారు.
నేవీలో 15 ఏళ్లు సేవలు అందించాను. అందులో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. భయంకరమైన సునామీ సమయంలో బతుకుమీద ఆశపోయింది. మరుసటి రోజు చైన్నెకి షిప్ వచ్చేసరికి పూర్తిగా డెడ్‌బాడీలు తేలుతున్నాయి. ఆ సమయంలో ఇంటికి ఫోన్ చేసేందుకు శాటిలైట్ ఫోన్ ఉపయోగించాము. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా ట్రింకోమలె (శ్రీలంక) వాళ్లకి రైస్, గోధుమ పిండి అందించాము. షిప్‌లో ఇంగ్లాండ్, జర్మనీ, రష్యా, అండమాన్, నికోబార్ వంటి 20 దేశాలు తిరిగాం. ఐఎన్‌ఎస్ వాల్‌సురా (గుజరాత్)లో శిక్షణ ఇచ్చారు. తర్వాత ఇన్‌కుల్–33 (అండమాన్, నికోబార్), ఐఎన్‌ఎస్ బీస్ (ముంబాయి), ఐఎన్‌ఎస్ సుకన్య (విశాఖ), ఐఎన్‌ఎస్ కొట్టబొమ్మన్ (కన్యాకుమారి) షిప్పుల్లో పనిచేశాను. ప్రస్తుతం ఏపీజీవీబీలో క్యాష్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్నాను.
– సువ్వారి శ్రీధర్,
ఫరీదుపేట, విశ్రాంత ఎలక్ట్రికల్ పెటీ ఆఫీసర్, నేవీ
నేను వైద్యుడిగా దేశం కోసం పోరాడుతున్న నావెల్ ఉద్యోగులు ఎంతో మందికి ఆరోగ్య సేవలందించాను. సముద్ర సేతు ఆపరేషన్‌లో భాగంగా మిడిల్ ఈస్ట్ నుంచి కరోనా సమయంలో ప్రవాస భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకుని రావడం జరిగింది. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ సప్లయ్ గొలుసును నిర్వహించేందుకు, ఆక్సిజన్ క్యారియర్ కొరతను నివారించేందుకు సౌత్‌ఈస్ట్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఆక్సిజన్ క్యారియర్స్‌ను యుద్ధప్రాతికన మన దేశానికి తీసుకొచ్చాం. 2023 లో తమిళనాడు తీరప్రాంతంలో ఆయిల్ రిగ్‌లో చిక్కుకున్న ఉద్యోగులను సురక్షితంగా కాపాడాను. అనేక అత్యవసర వైద్య సేవలు నడి సంద్రంలో అందించడం మరిచిపోలేని జ్ఞాపకం. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ సర్వీసులో చేరాను.
– డాక్టర్ సతీష్ మెర్రి,
విశ్రాంత నేవీ డాక్టర్, తీమర, పాతపట్నం
రష్యాలో ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య తయారీ సమయంలో రెండేళ్లు అక్కడే ఉన్న అనుభూతి మర్చిపోలేనిది. 2004లో టోక్యో వెళ్లే సమయంలో తైఫూన్ తుఫాను సమయంలో సముద్ర అలల మధ్య అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో రెండు రోజులు భయంగా సముద్ర ప్రయాణం సాగింది. 2014లో ట్రోపెక్స్‌లో భాగంగా 26 రోజుల పాటు ఏకధాటిగా సముద్ర ప్రయాణం చేయడం జరిగింది. ఇవి నాకు ఎదురైన మర్చిపోలేని అనుభవాలు.
– పైడి వేణుగోపాలరావు, విశ్రాంత నేవీ అధికారి
● ఇండియన్ నేవీలో సేవలందించిన సిక్కోలు నావికులు ● సాగరం
● ఇండియన్ నేవీలో సేవలందించిన సిక్కోలు నావికులు ● సాగరం
● ఇండియన్ నేవీలో సేవలందించిన సిక్కోలు నావికులు ● సాగరం
● ఇండియన్ నేవీలో సేవలందించిన సిక్కోలు నావికులు ● సాగరం


