నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరు
వామపక్ష, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు, న్యూ డెమోక్రసీ జిల్లా ఉపాధ్యక్షుడు వంకల మాధవరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళం నగరంలోని సుందరయ్య భవనంలో వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ కోనారి మోహన్‌రావు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం బుధవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై నిర్బంధం ఎత్తివేయాలని.. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రం, సభలు, సమావేశాలు పెట్టుకునే హక్కును కాపాడాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
అక్రమ అరెస్టులు ఎందుకు..?
వామపక్ష ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో ప్రజా ఉద్యమాలపై ఎందుకు నిర్బంధం ప్రయోగిస్తున్నారని జిల్లా మంత్రులను ప్రశ్నించారు. కార్గో ఎయిర్‌పోర్ట్, థర్మల్ పవర్ ప్లాంట్ ప్రతిపాదనలు రద్దు చేయాలని కోరుతూ ధర్నాకు పిలిపిస్తే అక్రమ అరెస్టులకు ఎందుకు పాల్పడ్డారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా తీరప్రాంతాన్ని అదానికి కట్టబెట్టి.. ఒకవైపున కార్గో ఎయిర్‌పోర్టు.. ఇంకొక వైపున థర్మల్ పవర్ ప్లాంట్‌తో జిల్లాలో ఎందుకు విధ్వంసానికి పూనుకుంటున్నారో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడమే అభివృద్ధా అని ప్రశ్నించారు. సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు, ఎయిర్‌పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకుడు వాబ యోగి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, పౌర హక్కుల సంఘం నాయకులు కేవీ జగన్నాథం, థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు సవర సింహాచలం, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ కె.నాగమణి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పోలాకి ప్రసాదరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెలమల రమణ తదితరులు పాల్గొన్నారు.


