కూటమి ప్రభుత్వంలో విద్యారంగం నిర్వీర్యం
● పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి
కొత్తూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగం నిర్వీర్యమైందని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి అన్నారు. మండలంలోని అడ్డంగి గిరిజన గ్రామంలో విలేకరుల సమావేశం బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో పాటు పర్యవేక్షణ కరువైందని దుయ్యబట్టారు. విద్యార్థులు స్క్రబ్ టైఫస్, మలేరియా, డయేరియా తదితర రోగాలబారిన పడి మృత్యువాత పడుతున్నాని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లికి వందనం మొత్తాన్ని మొదటి ఏడాది ఇవ్వకుండా ఎగనామం పెట్టారని, రెండో ఏడాది కూడా సక్రమంగా పథకం అమలు చేయలేదని మండిపడ్డారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ కాలేజీలకు కూటమి ప్రభుత్వం చెల్లించకపోవడంతో, విద్యార్థులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొస్తున్నాయని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు కారణంగా వందలాది ప్రభుత్వ పాఠశాలు మూతపడ్డాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తీరు మార్చుకొని విద్యారంగానికి మేలుచేసే చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గండివలస ఆనందరావు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చింతాడ సూర్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు సవర సువీక, వనము లక్ష్మీనారాయణ, అగతమూడి నాగేశ్వరరావు, సర్పంచ్ అగతమూడి రంజిత్, గంధవరపు నాగేంద్ర, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి గుడబండి పోలయ్య, పార్టీ నాయకులు సవర రమేష్, సవర సింహద్రి తదితరులు పాల్గొన్నారు.


