కనీస వేతనాలు అందజేయాలి
రణస్థలం: ఫీల్డ్ అసిస్టెంట్లకు కనీస వేతనాలు అందజేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏపీ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకంలో గత 19 ఏళ్లుగా ఫీల్డ్ అసిస్టెంట్లు నిబద్ధతతో పనిచేస్తున్నారన్నారు. ప్రస్తుతం వారికి నెలకి కేవలం రూ.5,745లు మాత్రమే వేతనం ఇస్తున్నారని, అతి తక్కువ వేతనాలతో వారి కుటుంబాలు బతకడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు తీరుతాయని ఫీల్డ్ అసిస్టెంట్లు భావించారని, కానీ గత ఏడాది కాలంలో రాజకీయ వేధింపులతో ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమ తొలగింపులు పెద్ద ఎత్తున జరిగాయని దుయ్యబట్టారు. వారికి నాణ్యమైన కొత్త సెల్‌ఫోన్లు, 5జీ సీమ్ కార్డ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు పి.బంగారు నాయుడు, కె.రమణ, జి.గణేష్, కె.నాగేశ్వరరావు, వై.రామారావు, వెంకటరమణ తదితరలు పాల్గొన్నారు.


