బీడుగా మార్చేస్తారా?
● బ్రూవరీస్ వాటర్ ప్లాంట్ వద్దే వద్దు ● తేల్చిచెప్పిన నగరప్పాలెం రైతులు ● ప్లాంట్ యజమానులు, గ్రామపెద్దలకు మధ్య కుదరని సయోధ్య
రణస్థలం: పచ్చని పొలాలను బీడు భూములుగా మార్చే వాటర్ ప్లాంట్ తమ ప్రాంతంలో వద్దే వద్దని రణస్థలం పంచాయతీ నగరప్పాలెం గ్రామస్తులు తేల్చిచెప్పారు. స్థానిక జగనన్న కాలనీ సమీపంలో ఆక్వా బ్రూవరీస్ వాటర్ ప్లాంట్ ఏర్పాటుపై కొన్నాళ్లుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ వద్దని పంచాయతీ గ్రామపెద్దలు కలెక్టర్ గ్రీవెన్సుతో పాటు మండల స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. అనుకూలమైన మరో వర్గం ప్లాంట్ ఏర్పాటు చేసేలా కథ నడుపుతున్నారు. తాజాగా మంగళవారం రెండు వర్గాల గ్రామపెద్దలు, పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులు, పంచాయతీ గ్రామస్తుల సమావేశం రసాబాసగా జరిగింది.
ప్లాంట్ వద్దే వద్దు..
ప్లాంట్ వల్ల భూగర్భజలాలు అడుగంటిపోయి పొలాలు బీడు భూములుగా మారిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. బోర్లుపై ఆధారపడి ఏటా మూడు పంటలతో సస్యశ్యామలంగా ఉండే తమ పొలాలకు నష్టం తప్పదని ఆందోళన చెందుతున్నారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటైతే 24 గంటలూ భూగర్భ జలాలు తోడేస్తారని, ప్లాంట్ నుంచి వెలువడే వ్యర్థ జలాలు పొలాల్లోకి విడిచిపెడతారని చెబుతున్నారు. తరతరాలుగా వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకుతున్న తమ జీవితాలు బుగ్గిపాలు అవుతాయని, పరిశ్రమ ఏర్పాటుకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.
టెంట్ వేస్తాం..
ప్లాంట్‌కు అనుకూలమైన వర్గం మాట విని పనులు ప్రారంభిస్తే టెంట్ వేసి నిరసన తెలుపుతామని, అందులో రాజీపడే ప్రసక్తే లేదని రైతులు, గ్రామపెద్దలు పరిశ్రమ యాజమాన్యానికి తేల్చిచెప్పారు. ఈ తరుణంలో అనుకూలమైన వర్గం ప్లాంట్ ఏర్పాటు చేసేలా పావులు కదిపారు. సమీపంలో అధిక భూములున్న వ్యక్తి ప్లాంట్ వల్ల జరిగే నష్టాలను వివరిస్తున్న నేపథ్యంలో అందులో ఓ వ్యక్తి మీ భూములు తాము కొంటామని మాట జారడంతో వ్యతిరేక వర్గానికి చిర్రెత్తుకొచ్చింది. సమావేశం గందరగోళంగా మారింది. ఒకానొక దశలో ప్లాంట్ ఎలా ఏర్పాటు చేస్తారో చూద్దామంటూ మాటల తూటాలు గట్టిగానే పేలాయి. ఇప్పటికే యూబీ పరిశ్రమ నుంచి విడిచిపెట్టి వ్యర్థ జాలాలు సమీప చెరువులోకి వస్తూ భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని గుర్తు చేశారు. అనంతరం గ్రామపెద్దలు సముదాయించి ప్లాంట్ ఏర్పాటు చేయవద్దని, చేస్తే టెంట్ వేసి నిరసన తెలుపుదామని చెప్పి ఎవరికి వారే వెళ్లిపోయారు.
బీడుగా మార్చేస్తారా?


