తాళ్లవలసకు అధికారుల వరుస | - | Sakshi
Sakshi News home page

తాళ్లవలసకు అధికారుల వరుస

Dec 2 2025 7:52 AM | Updated on Dec 2 2025 7:52 AM

తాళ్ల

తాళ్లవలసకు అధికారుల వరుస

తాగునీరు వల్ల డయేరియా రాలేదని తేల్చిన వైనం

కొత్తగా మరో మూడు కేసులు

సంతబొమ్మాళి: తాళ్లవలస గ్రామంలో డయేరియాతో ఒక వ్యక్తి మృతి చెందడంతో సోమవారం గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామాన్ని డీఎల్పీ ఐ.వెంకటరమణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ శంకర్‌ బాబు, డీఈ రామకృష్ణ, జిల్లా వైద్యశాఖ చెందిన వైద్యురాలు పి.సుజాత, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ మేరీకేథరిన్‌ సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, పీహెచ్‌సీ సిబ్బంది వేర్వేరుగా తాగునీరు తీసుకుని టెస్టులు చేశారు. రెండు టెస్టుల్లో కూడా నెగిటివ్‌గా వచ్చిందని తేల్చారు. నీటి వల్ల డయేరియా రాలేదని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది ఇంటింటా సర్వే నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులకు మందు జాగ్రత్తగా మందులను పంపిణీ చేశారు. డయేరియా అదుపులోకి వచ్చేంత వరకు గ్రామంలో మెడికల్‌ క్యాంపు కొనసాగుతుందని వైద్యాధికారులు తెలిపారు.

పీహెచ్‌సీ సిబ్బందిపై మండిపాటు

దండుగోపాలపురం ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వంపై జిల్లా వైద్యాశాఖకు చెందిన పి.సుజాత మండిపడ్డారు. గ్రామాల్లో ఇంత జరుగుతుంటే సమాచారం ఇవ్వరా అంటూ మందలించారు. ఏఎన్‌ఎం రాధమ్మ, ఆశఽ కార్యకర్త కల్యాణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకల్‌గా లేకపోతే గ్రామాల్లో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందంటూ ప్రశ్నించారు. వీరిపై చర్యలు తీసుకోవాలని పీహెచ్‌సీ డాక్టర్‌ గంగాధర్‌ విశ్వనాథంను ఆదేశించారు. రోస్టర్‌ చాట్‌ వేయకపోవడం, రిపోర్ట్‌ ఇవ్వడంతో తీవ్రమైన జాప్యం, ఫోన్‌లో సకాలంలో స్పందించకపోవడంపై ఎంపీహెచ్‌ఓ నాగేశ్వరరావు పై మండిపడ్డారు. ఉన్నతాధికారులు వస్తున్నారని తెలిసి కూడా యూనిఫారం వేయపోతే ఎలా అంటూ హెచ్‌వీ కామేశ్వరిని మందిలించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరించారు.

మరో మూడు కేసులు

తాళ్లవలసలో సోమవారం మరో మూడు కేసులు నమోదయ్యాయి. గొల్లపల్లి జగన్నాథరావు, మార్పు అఖిల, వల్లభ తిరుపతిరావు వాంతులు, విరేచనాలతో టెక్కలి జిల్లా పరిషత్‌లో చికిత్స పొందుతున్నారు. వీరికి ప్రాథమిక వైద్యం చేసి 108 సహాయంలో తరలించారు. తాగునీరు వల్ల వాంతులు విరేచనాలు కాకపోతే దేని వల్ల వస్తుందో అధికారులే తేల్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.

బాధితులకు తిలక్‌ పరామర్శ

టెక్కలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్‌ సోమవారం పరామర్శించారు. పూర్తి స్థాయిలో కోలుకునే విధంగా మెరుగైన వైద్యం అందజేయాలని కోరారు. అలాగే తాళ్లవలస గ్రామంలో డయేరియా వ్యాప్తికి గల కారణాలు తెలుసుకుని వ్యాప్తి లేకుండా గ్రామంలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని తిలక్‌ పేర్కొన్నారు. ఆయనతో పాటు నందిగాం ఎంపీపీ ఎన్‌.శ్రీరామ్ముర్తి, కోటబొమ్మాళి జెడ్పీటీసీ దుబ్బ వెంకట్రావు, నాయకులు కురమాన బాలకృష్ణ, సత్తారు సత్యం, చిన్ని జోగారావు, బి.రాజేష్‌ ఉన్నారు.

డీఎంహెచ్‌ఓ ఆరా

విషయం తెలుసుకున్న డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.అనిత తాళ్లవలస గ్రామంలో సందర్శించారు. గ్రామస్తులతో మాట్లాడి వైద్యసిబ్బందికి తగు సూచనలు అందించారు.

తాళ్లవలసకు అధికారుల వరుస 1
1/1

తాళ్లవలసకు అధికారుల వరుస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement