వైభవంగా ఆదిత్యుని కల్యాణం
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో మార్గశిర శుద్ధ ఏకాదశి సందర్భంగా స్వామి వారి కల్యాణ సేవ ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం ఉషా పద్మిని ఛాయా దేవేరులతో శ్రీవారి కల్యాణమూర్తులను అనివెట్టి మండపంలోకి తీసుకొచ్చి కల్యాణం జరిపించారు. ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు ఇప్పిలి సాందీపశర్మ కల్యాణ సేవ ప్రక్రియ పూర్తి చేశారు. ఈవో ప్రసాద్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళం కల్చరల్ : నగరంలోని ఏపీహెచ్‌బీ కాలనీకి చెందిన పి.సుధారాణి (65) మృతిచెందడంతో ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు పి.ఎ.ఉమామహేశ్వరరావు (రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్), కుమారుడు అప్పారావు (అడ్వకేట్), కుమార్తెలు ఎం.శ్యామల కుమారి, టి.కమలకుమారి నిర్ణయించారు. విషయాన్ని రెడ్‌క్రాస్‌కు తెలియజేయగా మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ పూతి సుజాత, చిన్నికృష్ణల ద్వారా సుధారాణి కార్నియాలు సేకరించారు. అనంతరం విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. ఈ సందర్భంగా దాత కుటుంబ సభ్యులను రెడ్‌క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు అభినందించారు. నేత్ర దానం చేయాలనుకునేవారు 7842699321 నంబరును సంప్రదించాలని కోరారు.
సాయుధ దళాల పతాక నిధికి విరాళాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: సాయుధ దళాల పతాక నిధికి విరాళాలను విరివిగా అందించి మాజీ సైనికుల సంక్షేమానికి తోడ్పాటు అందించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కోరారు. ఈ మేరకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ నెల 6న సాయుధ దళాల పతాక దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పేలిన ఫ్రిజ్
ఇచ్ఛాపురం : పట్టణంలోని ముత్యాలమ్మపేటలో డి.లక్ష్మునాయుడు ఇంట్లో సోమవారం విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా రిఫ్రిజిరేటర్ పేలింది. ఈ ఘటనలో గృహోపకరణాలు, ఇతర వస్తువులు కాలిపోయాయి. స్థానికుల సహకారంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంటి సామగ్రితో పాటు కుమార్తె జ్ఞానేశ్వరి కూచిపూడి, తైక్వాండోలో సాధించిన మెడల్స్ కూడా కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ.5 లక్షలు ఆస్తి నష్టం సంభవించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
వైభవంగా ఆదిత్యుని కల్యాణం
వైభవంగా ఆదిత్యుని కల్యాణం
వైభవంగా ఆదిత్యుని కల్యాణం


