ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం
శ్రీకాకుళం పాతబస్టాండ్: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాదాపుగా అన్నీ టీడీపీ కార్యకర్తలు, వారి ఏజెన్సీలకే ఇవ్వడం వల్ల వారంతా దళారులుగా మారి రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని, అటువంటి ఏజెన్సీలను మార్చాలని ఆమదాలవలస వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ కోరారు. ఈ మేరకు కలెక్టర్ గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందించారు. సరుబుజ్జిలి, బూర్జ, పొందూరు, ఆమదాలవలస మండలాల్లో రైతులు ప్రభుత్వం నిర్ణయించిన ధర రావడం లేదన్నారు. పొందూరు మండలంలోని రాపాక, కృష్ణాపురం వంటి ప్రాంతాల్లో అక్రమ క్వారీలు నిలుపుదల చేయాలని కోరారు. బూర్జ మండలం లక్కపురంలో ఆశా కార్యకర్త పోస్టు అక్రమ భర్తీని అడ్డుకోవాలన్నారు. సరుబుజ్జిలి మండలం పెద్దసవలాపురం సచివాలయంలో పాత స్థలంలోనే కొనసాగించాలని కోరారు.
మహిళలకు ఉపాధి శిక్షణ
ఎచ్చెర్ల : మండల కేంద్రం ఎచ్చెర్లలోని ఎన్‌టీఆర్ నైపుణ్యాభివృద్ధి, మహిళా సాధికారిత కేంద్రం (మహిళా ప్రాంగణం)లో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి (ఎపీఎస్‌ఎస్‌డీసీ–గుంటూరు) సౌజన్యంతో 18 నుంచి 45 ఏళ్ల మహిళలకు పలు ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ జిల్లా మేనేజర్ రబీకాసామ్యూల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్(60 రోజులు), హ్యండ్ ఎంబ్రాయిడర్(45 రోజులు) కోర్సులకు 8వ తరగతి, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సు(90 రోజులు)కు పదో తరగతి చదివి ఉండాలని పేర్కొన్నారు. ఆసక్తిగల మహిళలు ఈ నెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తామని, వివరాలకు 8309548067 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


