కలెక్టర్ గ్రీవెన్స్‌కు 124 అర్జీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్‌తో కలిసి 124 అర్జీలు స్వీకరించారు. డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌కుమార్, పలాస ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకాధికారి ఎం.వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
● గార మండలం శ్రీకూర్మం, మత్స్యలేశంతోపాటు ఆరు గ్రామాల వన సంరక్షణ సమితి పరిధిలో 500 ఎకరాల భూమి ఉందని, ఈ స్థలాన్ని అదాని కంపెనీకి ప్రభుత్వం అప్పగించిందని, ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు విన్నవించారు. స్థానికులకు సమాచారం లేకుండా, ఇటువంటి కేటాయింపులు చేయడం సరికాదని, దీనిపై ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు జెడ్పీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ గ్రామస్తులతో మాట్లాడారు.
● నగరంలోని రాజీవ్ గృహకల్ప, వాంబే కాలనీల నిర్మాణం చేసి చాలా కాలం అయ్యిందని, నిర్వహణ లేక, మరమ్మతులు చేయక శిథిలావస్థకు చేరాయని, తక్షణమే మరమ్మతులు చేయించాలని కాలనీవాసులు కోరారు.


