కనుల విందు..!
జానపద నృత్యాలకు ఆదరణ
పెరుగుతున్న కోలాటం ప్రదర్శనలు
ఆసక్తిగా నేర్చుకుంటున్న చిన్నారులు,
మహిళలు
ఉత్సాహం ఉంటే చాలు
సంతోషంగా ఉంది
అందరూ ప్రశంసిస్తున్నారు
కాలు కదిపితే..
ఇచ్ఛాపురం రూరల్:
జానపద కళలకు పుట్టినిల్లు మన పల్లెలు. రోజంతా శారీరక శ్రమతో సాయంత్రం ఇళ్లకు చేరిన ప్రజలకు ఈ కళలే ఆట విడుపు. సాంప్రదాయ కళలుగా భావించే పండారి భజనలు, కోయ నృత్యాలు, చిడతల భజన, అంజాట, కోలాటంకు ఒకప్పుడు విశేష ఆదరణ లభించేది. మారుతున్న కాలంతో పాటు ఇవి కూడా అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం క్రమేపీ వీటికి మరలా ఆదరణ పెరుగుతోంది. పండగలు, గణేష్, నవరాత్రులు, గ్రామ దేవత ఉత్సవాలు సందర్భంగా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుండడం, వాటికి జనాదరణ పెరుగుతుండడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. ముఖ్యంగా కోలాటం నృత్యానికి ఈ మధ్య కాలంలో విశేష ఆదరణ లభిస్తోంది. పండగలు, జాతరలు వస్తే చాలు గ్రామాల్లో కోలాటం సందడి కనిపిస్తోంది. ఆధునిక పాటలకు కోలాటం నృత్యాలు తోడై కనులవిందు చేస్తున్నాయి. ఇటీవల పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సాంప్రదాయ నృత్యాల వైపు మహిళలతో పాటు చిన్నారులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ప్రతీ మండలంలోనూ నాలుగైదు వరకు కోలాట బృందాలు ఏర్పడుతున్నాయంటే పల్లెల్లో కోలాటానికి ఎంత ప్రాచూర్యం లభిస్తుందో ఇట్టే చెప్పవచ్చు.
గురువుల వద్ద శిక్షణ
సినిమాలు, ఇబ్బడిముబ్బడిగా పెరిగిన టీవీ చానెళ్లు, వాటిలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను ప్రతిరోజూ తిలకించే పల్లె వాసుల్లో ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది. ప్రత్యామ్నాయంగా కనుమరుగువుతున్న కొన్ని కళలపై మక్కువ పెరిగింది. దీంతో వీటిని ప్రోత్సాహించే దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా పండగలు, అమ్మవారి ఉత్సవాలు, నందన్న ఉత్సవాలు తదితర సందర్భాల్లో కోలాటం ప్రదర్శించేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో కొంతమంది పెద్దలు సాంప్రదాయ కళలకు సానబెడుతున్నారు. కొత్త తరానికి వాటిని పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం సాయంత్రం వేళల్లో మహిళలు, బాలికలు కోలాటం నేర్చుకోవడంలో నిమగ్నమవుతున్నారు. కోలాటం గురువుల వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.
ఇప్పటికే నాకు వందలాది మంది బాలబాలికలకు పండారి చెక్క భజనలో శిక్షణ ఇచ్చిన అనుభవం ఉంది. ప్రస్తుతం మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కోలాటం ద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతత కల్పించేందుకు కంకణం కట్టుకున్నాను. ఐదేళ్లలో తొమ్మిది కోలాటం బృందాలు, పది వరకు పాండురంగ నృత్య కళా బృందాలను తయారు చేయడం జరిగింది. ఉత్సాహవంతులు నన్ను సంప్రదిస్తే వారికి శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాను.
– తిప్పన ధనుంజయరెడ్డి, నంది అవార్డు గ్రహీత, టి.బరంపురం, ఇచ్ఛాపురం మండలం
మా ఊర్లో మేమంతా కోలాటం నేర్చుకుంటున్నాం. కోలాటం నేర్చుకునేందుకు నా భర్తతో పాటు అత్త, మామయ్య, పిల్లలు ప్రోత్సాహిస్తున్నారు. ఇంట్లో పనులు ముగించి ప్రతిరోజూ సాయంత్రం 2 గంటల పాటు కోలాటం నేర్చుకుంటున్నాను. ఏడాది క్రితం నేర్చుకున్న మా బృందం తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధానంలో ప్రదర్శించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది.
– లండ సుశీల,
బొడ్డఖాళి గ్రామం, ఇచ్ఛాపురం మండలం
ఒకవైపు చదువుకుంటూనే ప్రతిరోజు రాత్రి సమయాల్లో మా ఊర్లో కోలాటం నేర్చుకుంటున్నాను. దేవుడి పాటలకు కోలాటం చేస్తుంటే అందరూ నన్ను ప్రశంసిస్తుంటారు. కోలాటం నేర్చుకోవడం వలన మానసిక ప్రశాంతతతో పాటు మంచి వ్యాయామం లభిస్తోంది.
– దుర్గాశి హారతిరెడ్డి,
హరిపురం, ఇచ్ఛాపురం మండలం
కనుల విందు..!
కనుల విందు..!
కనుల విందు..!
కనుల విందు..!
కనుల విందు..!
కనుల విందు..!


