గ్రంథాలయాలు..!
గ్రంథాలయాలను ఆదుకోవాలి
సమస్యలకు నిలయాలు..
● సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ● అరకొర వసతులతో అవస్థలు ● సెస్ బకాయిలు రూ.35 కోట్లు
శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో గ్రంథాలయాలు సమస్యలకు నిలయాలుగా మారుతున్నాయి. పాఠకుల తాకిడి బాగానే ఉన్నా వసతుల లేమితో నిరుద్యోగులు వాటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. నిధుల లేమితో పాటు నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతోంది. జిల్లాలో గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత ఇబ్బందిగా మారుతోంది. జిల్లాలో 45 గ్రంథాలయాలు, బుక్‌డిపో సెంటర్ల 100, విలేజ్ లైబ్రేరీలు 5 ఉన్నాయి. వీటిలో కేవలం రికార్డు అసిస్టెంట్లు ఐదుగురు మాత్రమే పనిచేస్తున్నారు. ఆఫీస్ అసిస్టెంట్లు 19 మంది ఉండాల్సి ఉండగా.. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్నారు. జిల్లావ్యాప్తంగా 104 పోస్టులకు గానూ 83 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న అన్ని గ్రంథాలయాలకూ సొంత భవనాలు ఉన్నప్పటికీ.. కొత్తూరు, కోటబొమ్మాళి లైబ్రేరీలకు మాత్రం సొంత భవనాలు లేవు. గ్రంథాలయాలకు అధికంగా దినపత్రికలు, మ్యాగజైన్‌లు, పోటీ పరీక్షల పుస్తకాలు చదవడానికి నిరుద్యోగ పాఠకులు వస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో పెద్ద సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు గ్రంథాలయాల్లో పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు.
సెస్ బకాయిల పరిస్థితి
గ్రంథాలయాల అభివృద్ధి కోసం ఇంటి పన్నులో 8 శాతం సెస్‌ను స్థానిక సంస్థలు వసూలు చేస్తుంటారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు సెస్ రూపంలో అందించాల్సిన బకాయిలు సమయానుకూలంగా జిల్లా గ్రంథాలయ సంస్థకు చెల్లించకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి. దీని ప్రభావం గ్రంథాలయాల అభివృద్ధిపై పరోక్షంగా పడుతోంది. పంచాయతీల నుంచి రావాల్సిన బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. జిల్లా గ్రంథాలయానికి దాదాపు రూ.35 కోట్ల వరకూ సెస్ బకాయిలు రావాల్సి ఉంది. 2020 నుంచి దాదాపుగా ఐదేళ్ల కాలానికి గాను ఈ సెస్ బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు పేరుకుపోవడంతో గ్రంథాలయాల నిర్వహణ మరింత భారంగా మారుతోంది. ఈ సెస్ బకాయిలు విడుదలైతే తప్ప నిర్వహణ గాడిన పడే అవకాశాలు కనిపించడం లేదు.
వసతులు లేక తిప్పలు
ఉదయం నుంచి గ్రంథాలయానికి అంకితం అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు సరిపడా సౌకర్యాలు ఉండడం లేదు. అలాగే మరుగుదొడ్లు సరిగా లేక యువతులు ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు కొలువు కోసం సన్నద్ధమయ్యే వారికి అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో లేకపోవడంతో వాటిని కొనుక్కోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రచురించే మేగజైన్‌లు సైతం అందుబాటులో ఉంచకపోవడంతో వారు నిరుత్సాహపడుతున్నారు. పలు సందర్భాల్లో దాతల ప్రోత్సాహంతో సమకూరుతున్న పుస్తకాలు, స్టడీ ప్యాడ్‌లు వంటి వాటి వలన నిరుద్యోగులకు కొంత ఊరట లభిస్తోంది.
గత ఐదేళ్లుగా సెస్ బకాయిలు పేరుకుపోయాయి. సెస్ బకాయిలను చెల్లించి గ్రంథాలయాలను ఆదుకోవాలి. సెస్ బకాయిల విషయాన్ని ఈవోపీఆర్డీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బకాయిలను సకాలంలో చెల్లించకపోవడం వలన గ్రంథాలయాల నిర్వహణ భారంగా మారుతోంది.
– వీవీజీఎస్ శంకరరావు,
జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి(ఎఫ్‌ఏసీ)
గ్రంథాలయాలు..!


