యువ కళాకారుడి హత్య దారుణం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): గంజాయి, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వివిధ కళారూపాలతో ప్రజలను చైతన్య పరుస్తున్న యువ కళాకారుడు పెంచలయ్యను హత్య చేయడం దారుణమని సాంస్కృతిక ప్రజా సంఘాల నాయకులు అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో అంబేడ్కర్ కూడలి వద్ద ఆదివారం ఆయన మృతికి నివాళిగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి ముఠా ఒక పథకం ప్రకారం ప్రజా నాట్యమండలి కళాకారుడు, డీవైఎఫ్‌ఐ మాజీ నాయకుడిని హత్య చేశాయన్నారు. హత్య కారకులను గుర్తించి, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో ఇటీవల కాలంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి సంస్కృతికి వ్యతిరేకంగా ఆయన ప్రజలను చైతన్య పరచడానికి అనేక కళారూపాలను రూపొందించి ప్రదర్శించాడు. పోలీస్ శాఖ సహకారంతో కూడా కొన్ని కార్యక్రమాలు చేశాడు. గంజాయి మానడంటూ స్థానికంగా ప్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారని, ఇది స్థానిక గంజాయి ముఠాకు ఏమాత్రం నచ్చలేదన్నారు. దీంతో కొంతకాలంగా ఆయన కదలికలపై నిఘా వేసి హత్య చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్య ముఠాలను పసిగట్టి నివారించడంలో వైఫల్యం చెందిందని, పోలీసు నిఘా వ్యవస్థకు ఉద్యమాలను అణచివేయడంపై ఉన్న శ్రద్ధ మాదక ద్రవ్యాల ముఠాలను నిర్మూలించడంలో లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు బి.కృష్ణమూర్తి, పి.తేజేశ్వరావు, కె.నాగమణి, పి.ప్రసాదరావు, ఎ.లక్ష్మి, ఆర్.ప్రకాశరావు, ఎం.గోవర్దనరావు, ఎ.సత్యం, ఎం.ఆదినారాయణమూర్తి, ఎన్.రమణ, పి.ఖగేష్, పి.సుధాకర్, కేధారేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


