తెలుగు సాహిత్యానికి వెలుగు జాడ గురజాడ
శ్రీకాకుళం కల్చరల్: తెలుగు సాహిత్యానికి వెలుగు జాడ గురజాడ అప్పారావు అని ప్రజా సాహితీ సంపాదకుడు పీఎస్ నాగరాజు అన్నారు. శ్రీకాకుళం నగరంలో జన సాహితీ ఆధ్వర్యంలో చావలి శ్రీనివాస్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన గురజాడ అప్పారావు వర్ధంతి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తెలుగు భాష, తెలుగు ప్రజలు ఉన్నంతకాలం ఆయన రచనలు సజీవంగా ఉంటాయని పేర్కొన్నారు. జన సాహితీ సభ్యుడు కె.బాలకృష్ణ గురజాడ రాసిన దేశభక్తి గేయం దేశమును ప్రేమించుమన్నా గేయాన్ని రాగయుక్తంగా ఆలపించారు. జనసాహితీ సభ్యుడు ఎల్.నరేష్ గురజాడ తాత్వికతపై మాట్లాడారు. పదాలు మళ్లీ ఊపందుకున్నాయి అనే అల కవితను పూజారి సూర్యనారాయణ ఆలపించారు. గురజాడ రచనల నేపథ్యంలో వర్తమాన కాల పరిస్థితులను ఎస్.భాస్కరరావు వివరించారు. జనసాహితీ జిల్లా కార్యదర్శి పి.మోహనరావు కళా అభిరుచి అనే అంశంపై మధురవాణి పాత్రను విశ్లేషణ చేశారు. గురజాడ అప్పారావు మరణించిన సందర్భంలో అతని కుమారునికి గిడుగు రామ్మూర్తి రాసిన లేఖను తమ్మినేని సూర్యనారాయణ చదివి వినిపించారు. సమావేశంలో సాహిత్య అభిమానులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.


