ఇద్దరు వ్యక్తులు అరెస్టు
పలాస: ద్విచక్ర వాహనాలు, ఇతర దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో ఇద్దరు వ్యక్తులను కాశీబుగ్గ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు కాశీబుగ్గ ఇన్‌చార్జి డీఎస్పీ లక్ష్మణరావు కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌లో ఆదివారం వివరాలు వెల్లడించారు. అరైస్టెన వ్యక్తుల్లో ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీ దుప్పలవలస గ్రామానికి చెందిన బూషర లక్ష్మణరావు, శ్రీకాకుళం టౌను పరిధిలోని గుజరాతీపేటకు చెందిన పిండ్రాల చిన్నిలు ఉన్నారు. వీరు అక్టోబరు 4వ తేదీన కాశీబుగ్గ టౌన్‌లోని మోర్ సూపర్ మార్కెట్‌కు ఎదురుగా పార్కింగ్ చేసిన పల్సర్ బైక్‌ను దొంగిలించారు. అలాగే అక్టోబర్ 12న కాశీబుగ్గ ఆంధ్రాబ్యాంకు వీధిలో ఒక ఇంటి వరండాలో ఉన్న మరో పల్సర్ బైక్‌ను కూడా దొంగలించి పట్టుకుపోయారు. అక్టోబరు 15న కాశీబుగ్గ టౌన్ చిన్న తిరుపతి ఆలయం వద్ద పార్కింగ్ చేసిన మరో ద్విచక్ర వాహనాన్ని దొంగలించారు. అలాగే కాశీబుగ్గలోని అన్నా క్యాంటిన్ వద్దనున్న స్కూటీని కూడా కొట్టేశారు. అదేవిధంగా శ్రీకాకుళం, బొబ్బిలి ప్రాంతాల్లో కూడా పలు దొంగతనాల కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నారని డీఎస్పీ వెల్లడించారు. కాశీబుగ్గలో దొంగలించిన ఒక బైక్‌లో పలాస నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తుండగా కాశీబుగ్గ పోలీసు వారిని గుర్తించి పట్టుకొని అరెస్టు చేశారన్నారు. వారు దొంగిలించిన బైకులను, 3 సెల్‌ఫోన్లను రికవరీ చేశామన్నారు. వీరిని అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరు పరిచామని తెలిపారు. సమావేశంలో కాశీబుగ్గ సీఐ పి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


