తాళం వేసిన ఇంట్లో చోరీ
మెళియాపుట్టి: ఎవరూ లేని సమయం చూసి తాళాలు వేసి ఉన్న ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడిన సంఘటన ఆదివారం పెద్దమడి గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు జినగ చంద్రావతి గ్రామంలోని తన ఇంటి ముందు చిన్న పాన్‌షాప్ పెట్టుకుని జీవిస్తోంది. ఈమె భర్త చాలాక్రితం మృతి చెందారు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు అవ్వడంతో శ్రీకాకుళంలో నివాసముంటున్నారు. చంద్రావతి పెట్టుకున్న పాన్‌షాప్‌లో వ్యాపారం సరిగాలేక పదిరోజుల క్రితం శ్రీకాకుళం వెళ్లింది. ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకుంది. అయితే గేట్‌కు వేసిన తాళాలు వేసినట్లే ఉండి.. ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లోని బీరువా తెరిచి రూ.5000ల నగదు, రెండు జతల చెవి పోగులు, పుస్తెలు దొంగలు దోచుకెళ్లారు. వెంటనే ఆమె మెళియాపుట్టి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఇంటిని పరిశీలించారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ


