పోలీసులు వదిలేశారు
గజదొంగను
జారవిడుచుకున్న నరసన్నపేట పోలీసులు
వెళ్తూ వెళ్తూ పోలీసుల ద్విచక్రవాహనాన్ని తీసుకుపోయి ఝలక్ ఇచ్చిన చోరుడు
కానిస్టేబుల్ ద్విచక్రవాహనంతో ఉడాయించేశాడు..
వ్యాపారి పట్టించాడు..
శ్రీకాకుళం క్రైమ్/నరసన్నపేట: రెండు తెలుగు రాష్ట్రాల్లో 30కు పైగా చోరీలు చేసిన పేరు మోసిన గజదొంగ. రద్దీ ప్రాంతాల్లోని దుకాణాల్లో రాత్రి సమయాన షట్టర్లు ఎత్తి దోచేయడం, ఉదయం దుకాణాల రద్దీ సమ యాల్లో యజమాని దృష్టి మరల్చి కౌంటర్‌లో లటక్కున నగదు తీసి పరారవ్వడం ఇతగాడి స్టైల్. జిల్లాలో ఇటీవల వరుస చోరీలు చేస్తున్నాడు. తాజాగా నరసన్నపేట కేంద్రంగా ఓ వ్యాపారి దుకాణంలో పట్టపగలు చోరీ చేసేందుకు ఎగబడి అదే వ్యాపారి కంటపడ్డాడు. అప్రమత్తమైన ఆ వ్యాపారి దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. కట్ చేస్తే పోలీసుల చెర నుంచి దొంగ పరారయ్యాడు. స్థానికులు, వ్యాపారులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. బుడితి గ్రామానికి చెందిన గురువెల్లి అప్పలనాయుడికి 18 ఏళ్ల నుంచే చోరకళ అబ్బింది. ఆయన ఉండేది ప్రకాశం జిల్లాలో. హైదరాబా ద్, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం జిల్లాల్లో నే కాక మన జిల్లాలోను చోరీలు చేశాడు. ఇటీవల న రసన్నపేట పోలీసుల కళ్లు గప్పి దాదాపు 5 చోరీలు చేయగా మొత్తంగా జిల్లాలో 10కు పైగా చేశాడు.
వ్యాపారి అప్రమత్తమై..
వారం రోజుల కిందట నరసన్నపేటలో పండ్లు, సిమెంట్, ఐరన్‌షాపు నడుపుతున్న ఓ వ్యాపారి చూస్తుండగానే కౌంటర్‌లో చేయిపెట్టి కొంత నగదు దోచేయబోయాడు. వ్యాపారి అప్రమత్తమై పట్టుకున్నాడు. వ్యాపారివి గత కొంతకాలంగా రూ. 20 లక్షల వరకు నగదు చోరీ కావడంతో గట్టిగా నిలదీయడంతో నాలుగు సార్లు షాపునకు దొంగతనానికి వచ్చానని ఒప్పుకోవడం.. సోషల్ మీడియాలో సంబంధిత వీడియో వైరల్ అవ్వడం జరిగింది. తర్వాత వ్యాపారి పోలీసులకు ఫోన్ చేసి అప్పలనాయుడిని అప్పగించారు.
విచారణ నిమిత్తం నరసన్నపేట పీఎస్‌కు పోలీసులు తీసుకెళ్లారు. ఈనెల 27న పోలీసులు నిద్రమత్తులో ఉండగా కన్నుగప్పి అప్పలనాయుడు పరారయ్యాడు. వెళ్తూ వెళ్తూ అదే స్టేషన్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ ద్విచక్రవాహనాన్ని సైతం పట్టుకుపోయినట్లు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. నరసన్నపేట పోలీసుల నిర్లక్ష్యానికి తోడు వారి బండినే దొంగ పట్టుకుపోవడంతో పోలీసులకు భలే ఝలక్ ఇచ్చాడంటూ అంతా నవ్వుకుంటున్నారు.
పోలీసులు వదిలేశారు


