యమకంకరలు
యథేచ్ఛగా కంకర అక్రమ తవ్వకాలు
పట్టించుకోని అధికారులు
పలాస:
పలాస మండలంలో గత కొన్ని నెలలుగా అక్ర మ కంకర తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు తవ్వకాలు కొనసాగుతున్నాయి. కేదారిపురం, గంగువాడ, లొద్దబద్ర పరిసర ప్రాంతాల్లోని కొండలు అక్రమార్కులకు అడ్డాగా మారా యి. అలాగే ఇటీవల రామకృష్ణాపురం వద్ద గల ఉజ్జిడి మెట్టను కూడా కొల్లగొడుతున్నారు. ఈ కంకరంతా మున్సిపాలిటీ, మండలంలోని రియల్ ఎస్టేటు వెంచర్లకు తరలిస్తున్నారు. అయినా సంబంధిత రెవెన్యూ, మైన్స్ అధికారులకు చీమ కుట్టినట్టయినా లేకపోవడం విశేషం. ఇంత వరకు ఒక్క ట్రాక్టర్‌ను గానీ, జేసీబీని గానీ సీజ్ చేయకపోవడం అధికారుల పనితనాన్ని చూపిస్తోంది.
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు
అక్రమ తవ్వకాల విషయంలో ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో తప్పని పరిస్థితిలో పలాస రెవెన్యూ అధికారులు సిబ్బంది, మైన్స్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇటీవల కంబిరిగాం, లొద్దబద్ర తదితర ప్రాంతాల్లో కూడా మైన్స్ అధికారులు పర్యటించి పరిశీలించారు. ఆ తర్వాత దానిపై ఏం చర్యలు తీసుకున్నారంటే తగిన సమాధానాలు లభించడం లేదు. తాజాగా శనివారం కూ డా పలాస మండలం రామకృష్ణాపురం వద్ద గల ఉజ్జిడి మెట్టను పరిశీలించారు. వారితో స్థానిక వీఆర్‌ఓ నౌషద్ అల్లా ఒక్కరు మాత్రమే ఉన్నారు. అక్కడకి వెళ్లి చూసిన వారికి ఈ మెట్ట ఏమైపోయిందని స్థానికులకు ఆశ్చర్యం కలుగుతోంది. వెళ్లిన అధికారులకు కూడా కొండ తవ్విన ఆనవాలు, తరలిపోయిన కంకర కళ్లకు కట్టినట్టు కనిపించింది. ఎంత కంకర తవ్వుకుపోయారనేది పరిశీలించి ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఆదాయాన్ని వారి నుంచే వసూలు చేసి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


