ఇదేం సహకారం?
అందుబాటులోకి తేవాలి
ప్రాథమిక సహకార సంఘాల
ఆధ్వర్యంలో 23 గోదాముల నిర్మాణం
గత వైఎస్సార్‌సీపీ హయాంలోనే
18 చోట్ల పనులు పూర్తి
వివిధ దశల్లో ఐదు గోదాములు
ప్రారంభించడంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం
రైతులకు తప్పని ఇక్కట్లు
ఉన్నతాధికారులకు నివేదించాం..
హిరమండలం:
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయి. ప్రధానంగా వ్యవసాయ అనుబంధ రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. కీలకమైన సహకార శాఖ ద్వారా రైతులకు మెరుగైన సేవలందించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో లక్ష్యం నీరుగారిపోతోంది. ముఖ్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన పథకాలు, నిర్మాణాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరితంగా, అనాలో చితంగా వ్యవహరిస్తోంది. రైతులు పండించే పంట లు, వ్యవసాయ ఉత్పత్తులు సంరక్షించేందుకుగాను గత ప్రభుత్వం పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో గోదాము ల నిర్మాణం చేపట్టింది. వాటిని ప్రారంభించడంలో ప్రస్తుత సర్కారు తీవ్ర అలసత్వం వహిస్తోంది.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో సాగుకు పెద్దపీ ట వేస్తూ జిల్లా వ్యాప్తంగా పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 25 గోదాముల నిర్మాణానికి పూనుకుంది. అప్పట్లో 18 గోదాముల నిర్మాణం పూర్తయ్యింది. ఐదు గోదాములు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. మరో రెండింటికి స్థల సమస్య కారణంగా ప్రారంభం కాలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నరవుతున్నా గోదాముల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పూర్తయిన వాటి సేవలను ప్రారంభించలేదు. పెండింగ్‌లో ఉన్న వాటి పనులు పూర్తిచేయలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాలకవర్గాల మార్పుపై ఉన్న శ్రద్ధ గోదాముల నిర్మాణంపై లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములకు ఒక్కోదానికి రూ.40 లక్షలు, 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న వాటికి రూ.70 లక్షల చొప్పున కేటాయించారు. ఈ లెక్కన రూ.12 కోట్లు వరకూ ఖర్చు చేశారు. కానీ సేవలను అందుబాటులో తేవడంలో మాత్రం సహకార శాఖ పూర్తిగా విఫలమైంది.
2019కు ముందు కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలో సహకార వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్న విమర్శ ఉంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక వాటిని గాడిన పెట్టింది. డీసీసీబీ లావాదేవీలను మరింత పెంచగలిగింది. అన్ని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను కంప్యూటరీకరణ చేసింది. జిల్లాలో 37 పీఏసీఎస్‌ల పరిధిలో సభ్యులుగా ఉన్న 1,01,671 మంది రైతులు వివిధ రూపాల్లో లబ్ధి పొందారు. తొలుత ఎటువంటి రుసుం లేకుండానే ఈ సంఘాల ద్వారా రుణాలు, ఎరువులను రైతులు పొందేవారు. పంట ఉత్పత్తులు విక్రయించాక తిరిగి రుణాలు చెల్లించేవారు. కొద్దిరోజుల తర్వాత సభ్యత్వ రుసుం కింద రూ.10 మాత్రమే వసూలు చేసేవారు. సంఘ సభ్యులుగా చేర్చుకునేవారు. ప్రాంతీయ వ్యవసాయ కో ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక పీఏసీఎస్‌లలో సభ్యత్వం తగ్గిపోయింది. ఓ చిన్నపాటి బ్యాంకు అకౌంట్ల మాదిరిగా కూడా లేదు. దీనికి సభ్యత్వ రుసుం పెరగడమే ప్రధాన కారణం. ప్రస్తుతం రూ.300 సభ్యత్వ రుసుంగా నిర్ణయించారు. దీంతో రైతులు ముందుకురాని పరిస్థితి. ఇప్పటికై నా పాలకులు స్పందించి పీఏసీఎస్‌లను బలోపేతం చేయడంతో పాటు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన ఆ 23 గోదాములను అందుబాటులో తేవాలని రైతులు కోరుతున్నారు.
పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన బహుళ ప్రయోజన సౌకర్య గోదాములు ప్రభుత్వం అందుబాటులో కి తీసుకురావాలి. రైతులు పండించిన ధాన్యాన్ని గోదాములలో ఉంచేలా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలి.
– కరణం శివరాం, రైతు, పిండ్రువాడ,
హిరమండలం మండలం
జిల్లాలో 25 గోదాములు మంజూరు కాగా 23 చోట్ల నిర్మాణం పూర్తయ్యింది. వాటిని ప్రారంభించాలని ఉన్నతాధికారులకు విన్నవించాం. ఆదేశాలు వచ్చాక త్వరలో ప్రారంభించి సేవలు అందుబాటులోకి తెస్తాం.
– కె.మురళీకృష్ణమూర్తి,
డివిజనల్ సహకార శాఖ అధికారి, టెక్కలి
ఇదేం సహకారం?


