ఇదేం పద్ధతి..?
● సచివాలయాల ఏఎన్‌ఎంల పదోన్నతుల్లో ఎస్టీలకు అన్యాయం
అరసవల్లి: గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి తొలిసారిగా గ్రేడ్–3 ఏఎన్‌ఎం పోస్టులను నియమించారు. అయితే ఈ పోస్టుల్లో ఉన్నవారికి గ్రేడ్–2 ఏఎన్‌ఎంలుగా పదోన్నతులు కల్పిస్తున్న తీరు పలు అనుమానాలకు గురి చేస్తోందని జిల్లా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా గ్రేడ్–3 ఏఎన్‌ఎంలు పదోన్నతులు కల్పించాలంటూ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే పదోన్నతులను కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఇష్టానుసారంగా పదోన్నతులు కల్పిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి పదోన్నతులు కల్పిస్తున్న విధానంలో లోపాలున్నాయని ఎస్టీ ప్రతినిధులు తప్పుపట్టారు. దీనిపై శనివారం ఉదయం నుంచి పలువురు ఎస్టీ కేటగిరికి చెందిన ఏఎన్‌ఎంలు సంఘ ప్రతినిధులతో కలిసి డీఎంహెచ్‌వో డాక్టర్ కె.అనితను కలిసేందుకు ప్రయత్నించారు. కలవడం కుదరకపోవడంతో చివరికి శనివారం సాయంత్రం కార్యాలయ ఏవో బాబూరావుకు వినతిపత్రాన్ని అందజేసి వెనుదిరిగారు. పదోన్నతులు కల్పిస్తే కచ్చితంగా ఎస్టీలకు 6 శాతం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాప్తికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా పదోన్నతులకు అర్హతలున్న 154 పోస్టుల్లో.. ఎస్టీ కేటగిరికి కనీసంగా 9 పోస్టులకు పదోన్నతులు కల్పించాల్సి ఉంది. కానీ జిల్లావ్యాప్తంగా రిజర్వేషన్ ప్రాప్తికి ఒక్క పోస్టుకు కూడా పదోన్నతి ఇవ్వలేదు సరికదా.. జనరల్ కేటగిరిగా నాలుగు పోస్టులకు పదోన్నతులు కల్పించి మమ అనిపించారు. అందువలన ఇప్పటికై నా జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు ఈ అంశంపై పునః పరిశీలించి కొత్త నియామకాలకు కొత్త సైకిల్ రోస్టర్‌ను అమలు చేసి ఎస్టీలకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఈ అక్రమాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని జిల్లా ఆదివాసి సంక్షేమ పరిషత్ జనరల్ సెక్రటరీ బైదిలాపురం సింహాచలం హెచ్చరించారు.


