సర్వర్ డౌన్.. రైతుల ఆందోళన
రెండు రోజులుగా తిరుగుతున్నాం
నరసన్నపేట:
నరసన్నపేట మండలంలో శనివారం ఒక్క బస్తా ధాన్యం కూడా మిల్లులకు పంపడం వీలు కాలేదు. ఉదయం నుంచి వాహనాల్లో ధాన్యం లోడ్ చేసుకొని ట్రక్ షీట్ కోసం రైతులు పడిగాపులు పడినా సాయంత్రం వరకూ పని కాలేదు. దీంతో ధాన్యం లోడు చేసిన ట్రాక్టర్లు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి. దీంతో అటు రైతులు ఇటు వాహన డ్రైవర్లు అష్టకష్టాలు పడ్డారు. చిన్నకరగాం రైతు సేవా కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ‘శుక్రవారం నుంచి షెడ్యూలింగ్ కేసం, ట్రక్ షీట్ జనరేట్ కోసం వస్తున్నాం.. ఇప్పటికీ పని కాలేదు. లోడు చేసిన ధాన్యం వాహనాల్లోనే రెండు రోజులుగా ఉంది. రైతులకు ఏమిటీ దుస్థితి..’ అని కంబకాయ, చిన్నకరగాం, పెద్ద కరగాం, జమ్ము, తామరాపల్లి, సత్యవరం, కోమర్తిలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నుంచి యాప్ ఆపసోపాలు పడుతుంది. పగలంతా కలిపి 30 నిమిషాలు అయినా పనిచేయలేదని సమాచారం.
ధాన్యం 110 బస్తాలు సిద్ధం చేశాను. వాహనం సిద్ధమైంది. రైతు సేవా కేంద్రంలో షెడ్యూల్ ఇస్తే ట్రక్ షీట్ జనరేట్ అవుతుంది. అది పట్టుకొని మిల్లుకు వెల్లాలి. ఈ ట్రక్ షీట్ జనరేట్ కావడం లేదు. అసలు యాప్ ఓపెన్ కావడం లేదు. రైతుల కష్టాలు ప్రభుత్వాలకు పట్టవా.
– పంగ వెంకటరమణ,
చిన్నకరగాం
సర్వర్ డౌన్.. రైతుల ఆందోళన


