నన్నొదిలి వెళ్లిపోయావా..
తన కళ్లెదుటే తల్లి మృతిచెందడంతో ఆ కుమారుడు తల్లడిల్లిపోయాడు. తాను లేవలేని స్థితిలో ఉన్నప్పటికీ ‘నన్ను వదిలి వెళ్లిపోయావా..’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. రక్షించండంటూ అటువైపుగా రాకపోకలు సాగించిన ప్రతిఒక్కరినీ వేడుకున్నాడు. ఈ హృదయ విదారకర ఘటన అందరినీ కంటతడి పెట్టించింది.
అమ్మా..
● కుమారుడి కళ్లెదుటే తల్లి మృతి ● షుగర్ టెస్టులకు తీసుకెళ్తుండగా స్కూటీని ఢీకొట్టిన లారీ ● కొల్లివలసలో విషాదఛాయలు
తల్లి మృతదేహం వద్ద రోదిస్తున్న కుమారుడు మణికంఠ,
(ఇన్‌సెట్లో) భానుమతి(ఫైల్)
ఆమదాలవలస/బూర్జ:
ఆమదాలవలస పట్టణ శివారులోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రాంతంలో ఇండ్రస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి చెందగా కుమారుడికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్జ మండలం కొల్లివలస గ్రామానికి చెందిన నున్నగొప్పల మణికంఠ తన తల్లి భానుమతి (50)ని షుగర్ టెస్టుల నిమిత్తం శ్రీకాకుళం తీసుకెళ్లేందుకు స్కూటీపై బయలుదేరారు. ఫ్లై ఓవర్ దిగువకు చేరుకునే సమయంలో శ్రీకాకుళం వైపు నుంచి పాలకొండ వైపు కొబ్బరికాయల లోడుతో వెళుతున్న లారీ అతివేగంతో ఓవర్ టేక్ చేసి స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో భానుమతి అక్కడికక్కడే మృతిచెందగా.. కుమారుడు మణికంఠకు తీవ్ర గాయాలపాలయ్యాడు.
తల్లడిల్లిన కుమారుడు..
కళ్ల ముందే కన్నతల్లి రక్తపుమడుగులో కొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో మణికంఠ తల్లడిల్లుతూ చేస్తున్న రోదనలు మిన్నంటాయి. తాను లేవలేని స్థితిలో ఉన్నప్పటికి లేవాలని ప్రయత్నిస్తూ రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపుతూ వారి సహాయం కోరడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. సమాచారం తెలుసుకున్న ఆమదాలవలస పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన స్థలం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందడంతో వారికి సమాచారం అందించారు. అనంతరం రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మణికంఠను చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొల్లివలసలో విషాదఛాయలు..
రోడ్డు ప్రమాదంలో భానుమతి మృతి చెందడంతో స్వగ్రామం కొల్లివలసలో విషాదఛాయలు అలముకున్నాయి. భానుమతికి భర్త కొండలరావు, కుమారుడు మణికంఠ ఉన్నారు. కుమార్తెకు వివాహం అయ్యింది.
చింతాడ రవికుమార్ పరామర్శ..
విషయం తెలుసుకున్న ఆమదాలవలస వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు, స్థానికులతో మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. భానుమతి మృతికి సంతాపం తెలుపుతూ ఆమె భర్త, వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడు కొండలరావుతో మాట్లాడి ఓదార్చారు.
నన్నొదిలి వెళ్లిపోయావా..
నన్నొదిలి వెళ్లిపోయావా..
నన్నొదిలి వెళ్లిపోయావా..


