చంద్రబాబు మాటలేమయ్యాయి..?
● సంధ్యారాణిని మంత్రి పదవి నుంచి వెంటనే తప్పించాలి ● వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి బాధిత మహిళకు అండగా ఉండాల్సింది పోయి, బాధించిన వాడికి అండగా నిలవడం దారుణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. మంత్రి కుమారుడు పృథ్వీ, పీఏ మీద ఎస్పీకి మూడు పేజీల ఫిర్యాదు ఇచ్చినా కనీస చర్యలు తీసుకోకపోవడం సరికాదన్నారు. ఆడబిడ్డ మీద ఎవరైనా చెయ్యి వేస్తే అదే చివరి రోజు అవుతుందని చెప్పిన సీఎం చంద్రబాబు మాటలేమయ్యాయని ప్రశ్నించారు. ఎక్కడైనా మహిళలకు అన్యాయం జరిగితే తాట తీస్తాం.. తోలుతీస్తామన్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ గొంతు మూగబోయిందా అని ప్రశ్నించారు. సహచర మంత్రి పీఏ ఇలా చేస్తే హోం మంత్రి మహిళగా ఏం చేస్తోందని నిలదీశారు. సత్యసాయి జిల్లాలో అంగన్‌వాడీ హెల్పర్ ఉద్యోగానికి రిజైన్ చేయాలని టీడీపీ నేత లు ఒత్తిడి చేశారని, ఆమైపె దాడిచేసి కొట్టిన విషయాన్ని ఆమె సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేసిన సంగతి బయటకు వచ్చినా పట్టించుకోలేదని తెలిపారు. శ్రీకాకుళంలో ఆమె శుక్రవారం సాక్షితో మాట్లాడారు. బాధించే వారంతా టీడీపీ నేతలేనని, టీడీపీ తెలుగు దండుపాల్యం పార్టీలా మారిందని మండిపడ్డారు. హోంమంత్రి పక్క రాష్ట్రానికి వెళ్లి డైలాగులు చెప్పడం కాదని, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను నియంత్రించే చర్యలు చేపట్టాలని కోరారు. ఎస్పీకి రాసిన ఫిర్యాదులో బాధిత మహిళ స్పష్టంగా ఆరోపణలు చేశారని, మంత్రి కొడుకు పృథ్వీ, ఇతర పెద్ద నాయకుల వద్దకు కామ వాంఛ తీర్చడానికి పంపించమన్న దురాలోచన నుంచి రక్షణ కల్పించాలని కోరిందని అన్నారు. ఇంత జరుగుతున్నా ఆ పీఏను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఆమెను మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ చేయాలని, మంత్రి పీఏని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సత్యసాయి జిల్లా రాప్తాడులో అంగన్‌వాడీ ఆయా వేధింపులకు గురైతే పట్టించుకోలేదని, 14 ఏళ్ల బాలికపై 14 మంది గ్యాంగ్‌రేప్ చేస్తే ఆ విషయాన్ని బయటకు రాకుండా చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక 18 నెలల్లో మహిళలపై జరిగిన క్రైమ్‌రేట్ 4శాతం పెరిగిందని, మహిళలపై జరిగిన రేప్‌లు 9శాతం పెరిగాయన్నా రు. మద్యం, గంజాయి, డ్రగ్స్ వాడకం కూడా 21 శాతం పెరిగిందని తెలిపారు. లా అండ్ ఆర్డర్‌ని కంట్రోల్ చేయలేని అసమర్థ సీఎం చంద్రబాబునాయు డు, హోం మినిస్టర్ అనిత నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు.


