జవహర్ నవోదయం విద్యా ఉషోదయం
ప్రవేశం ఎలా..?
పారదర్శకంగా ప్రవేశ పరీక్ష
●డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష ●ఎంపికై నవారికి అత్యుత్తమ విద్య
●గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు
సరుబుజ్జిలి:
గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల్లోని విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో జిల్లాలోని సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస సమీపంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో, 32 ఎకరాల విస్తీర్ణంలో నవోదయ విద్యాలయం 1988లో ప్రారంభించారు. ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు(తమిళనాడు మినహా), 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 660 జేఎన్‌వీ కేంద్రాలు విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 కేంద్రాలు ఉన్నాయి. వెన్నెలవలస విద్యాలయంలో విభిన్నమైన బోధన పద్ధతి, వసతి, విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానంతో పాటు నాయకత్వ లక్ష్యణాలను పెంపొందించడం, స్వచ్ఛమైన వాతావరణం వంటి ప్రత్యేకతలతో దేశంలోనే ఖ్యాతి గడించింది. ఈ కేంద్రంలో సీబీఎస్‌ఈ విధానంలో ప్రస్తుతం 6 నుంచి 12 తరగతుల వరకు 416 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
బాల, బాలికలకు 6 నుంచి 8 తరగతులు, 9 నుంచి 12 తరగతులకు 4 వేర్వేరుగా బ్లాకుల్లో వసతి సౌకర్యం కల్పిస్తారు. ఈ నాలుగు బ్లాక్‌ల పేర్లు ఆరావలి(రాజస్థాన్), నీలగిరి(తమిళనాడు), ఉదయగిరి(ఒడిశా), శివాలిక్(పంజాబ్–హర్యానా) దేశంలోని నాలుగు దిక్కుల పర్వతాలతో ఉండడం విశేషం. దీనికి అనుగుణంగానే ఎంపిక చేయబడిన కొంతమంది విద్యార్థులు దేశంలోని మిగతా జేఎన్‌వీలకు వెళ్లి తొమ్మిదో తరగతిలో ఏడాది పాటు విద్యానభ్యసిస్తారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్ విద్యార్థులు ఏటా 23 మంది ఇక్కడి వస్తుంటారు. దీనివల్ల సోదరభావం అభివృద్ధి చెందడమే కాకుండా బాల్యంలోనే దేశంలోని వివిధ ప్రాంతాలపై అవగాహన కలుగుతుంది.
మారుతున్న పోటీ ప్రపంచంతో పాటు ఇక్కడి విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా శిక్షణ అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు 40 కంప్యూటర్లు, ల్యాబ్‌టాప్‌ల ద్వారా విద్యార్థులు రోజువారీ అభ్యాసం అవ్వడంతో పాటు హైస్పీడ్ ఇంటర్‌నెట్ సౌకర్యం కూడా ఉండడంతో ప్రపంచంతో అనుసంధానం అవుతారు. దీనితో పాటు డిజిటల్ తరగతులు, నిష్టాతులైన అధ్యాపకులు, ల్యాబ్ విద్యార్థుల సామర్థ్యాన్ని రెట్టింపు చేసేందుకు దోహదపడుతుంది. తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కూడా చక్కగా మాట్లాడగలగడం ఇక్కడి విద్యార్థుల అదనపు బలం.
జిల్లాలో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులతో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లు పట్టణ ప్రాంతాలకు కేటాయిస్తారు. మొత్తం సీట్లలో 1/3 వంతు సీట్లు బాలికలకు కేటాయిస్తారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5, దివ్యాంగులకు 3 శాతం సీట్లు రిజర్వ్ చేయబడతాయి. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు జరుగుతాయి.
రెండు గంటల వ్యవధిలో పరీక్షలో మూడు విభాగాలు ఉంటాయి. 100 మార్కులకు విద్యార్థి చదువుతున్న మాధ్యమంలో ప్రశ్నాపత్రం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ 50 మార్కులు, అర్థమెటిక్ 25 మార్కులు, లాంగ్వేజ్ టెస్ట్‌కు 25 మార్కులు కేటాయిస్తారు. మొత్తం 2 గంటల సమయంలో 3 విభాగాలకు సమాధానాలు రాయాలి. వీటిలో 5వ తరగతికి సంబంధించి గణిత పరీక్షలో అంకెలు, సంఖ్యా పద్ధతి, భిన్నాలు మరియు మేథాశక్తికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఓఎంఆర్ సీట్లలో మాత్రమే బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్నుతో సమాధానాలు రాయాలి.
విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5వ తరగతిలో చదువుతూ ఉండాలి. నవోదయ విద్యాలయంలో ఆరో తరగతితో మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఒక్కో విద్యాలయానికి 80 సీట్లు కేటాయిస్తారు. ఒకసారి ప్రవేశం పొందిన విద్యార్థులు 12వ తరగతి(ఇంటర్) వరకు విద్యాభ్యాసం చేయవచ్చు. 8వ తరగతి వరకు విద్యార్థి మాతృభాషలో బోధన ఉంటుంది. తర్వాత ఆంగ్లంలో బోధనలు ఉంటాయి. ఇంటర్ పరీక్షలకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో హాజరు కావాలి.
6వ తరగతి ప్రవేశ పరీక్ష అంతా పారదర్శకంగా నిర్వహిస్తాము. ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఎటువంటి ఆందోళన చెందవద్దు. ప్రవేశ పరీక్ష కోసం 7,239 మంది దరఖాస్తులు చేశారు. డిసెంబర్ 13న జిల్లాలోని 32 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ప్రశ్నాపత్రం తయారీ, విద్యార్థుల ఎంపిక అంతా సీబీఎస్‌ఈ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రతిభ ఉన్నవారికి తప్పక సీటు లభిస్తుంది. ఒత్తిడి లేకుండా పరీక్షలుకు సిద్ధమవ్వాలి.
– బి.బేతనసామి, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్,
వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయం
జవహర్ నవోదయం విద్యా ఉషోదయం
జవహర్ నవోదయం విద్యా ఉషోదయం


