మూడు కేటగిరీలుగా భజన మందిర నిర్మాణాలు
అరసవల్లి: తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలోని శ్రీవాణి ట్రస్ట్ నిధులతో జిల్లాలో మత్స్యకార, బీసీ, ఎస్సీ ఎస్టీ తదితర బలహీన వర్గాల పంచాయతీ, కాలనీల్లో గుడి లేని ప్రాంతాల్లో కొత్తగా భజన మందిరాల నిర్మాణానికి నిధులు మంజూరుకు మార్గదర్శకాలను విడుదలయ్యాయని జిల్లా దేవదాయ శాఖ సహాయ కమిషనర్ బి.ఆర్.వి.వి.ప్రసాద్ పట్నాయక్ ప్రకటించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మూడు వర్గాలుగా భజన నిర్మాణాలు జరిపేందుకు టీటీడీ నిర్ణయించిందని వివరించారు. ఆయా ప్రదేశాల్లో ప్రభుత్వానికి చెందిన లేదా ఎవరైనా అంగీకారంలో ఇచ్చిన ప్రైవేటు భూములనైనా (యజమాని బాండ్ పేపర్ అగ్రిమెంట్‌తో) ఈ భజన మందిరాల నిర్మాణాలకు వినియోగించవచ్చునని పేర్కొన్నారు. స్థల పరిశీలన అనంతరం అర్హత ఉన్న చోటే నిర్మాణాలకు ఆమోదం లభిస్తుందన్నారు. మందిరాల మంజూరు అంశాలన్నీ దేవదాయ శాఖ ద్వారానే జరుగుతాయని, తమ ప్రాంతాల్లో భజన మందిరాలను నిర్మించదలచిన వారు కమిటీగా ఏర్పడి స్వీయ ధృవపత్రాలతో పాటు ఆయా స్థలాల హద్దుల వివరాలను టీటీడీ ఫార్మాట్ దరఖాస్తులో పొందుపరిచి జిల్లా దేవదాయ శాఖాధికారి కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. టైప్–ఎ కింద 5 సెంట్ల భూమి ఉన్న చోట భజన మందిరాలకు రూ.10 లక్షలు, టైప్–బి కింద 10 సెంట్ల విస్తీర్ణంలో నిర్మాణానికి రూ.15 లక్షలు, 10 సెంట్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణానికి రూ.20 లక్షల వరకు అంచనా వ్యయంగా శ్రీవాణి ట్రస్ట్ నిధులను మంజూరవుతాయని వివరించారు. దరకాస్తులను పరిశీలించి, స్థలాల పరిశీలన బాధ్యతలన్నీ దేవదాయ శాఖ ఇంజినీర్లు, ఇన్సెస్పెక్టర్‌ల ఆధ్వర్యంలో పూర్తయ్యాక అర్హులను గుర్తించి పూర్తి వివరాలను రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపించనున్నామని ప్రసాద్ పట్నాయక్ వివరించారు.


