గంజాయితో ఇద్దరు అరెస్టు
ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా పాత్రపూర్ గ్రామానికి సంజుక్తదాస్ అనే మహిళ తన భర్తతో కలిసి సూరత్‌లో ఉండేది. అక్కడ గంజాయి వ్యాపారం చేస్తున్న తన భర్త స్నేహితుడు రంజాన్ ప్రదాన్, గంజాయి సమకూర్చే కునిపండాతో పరిచయమేర్పడింది. కొద్దిరోజుల తర్వాత భర్త మరణించడంతో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో పాత్రపూర్ గ్రామానికి చెందిన లోకనాథ్ ప్రదాన్‌తో కలిసి ఒడిశా నుంచి 29 కేజీల గంజాయి కొనుగోలు చేసి సూరత్ తరలించడానికి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌కు బుధవారం చేరుకున్నారు. స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు గంజాయితో వీరిరువురు పట్టుబడ్డారు. గంజాయితో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో పట్టణ పోలీస్‌స్టేషన్ ఇన్‌చార్జి కవిటి ఎస్సై రవివర్మ, సిబ్బంది పాల్గొన్నారు.


