వ్యక్తి మృతి కేసులో ఐదుగురి అరెస్టు
టెక్కలి రూరల్: గోపినాథపురంలో సమీపంలో ఈ నెల 23వ తేదీ రాత్రి కొమనపల్లి పద్మనాభం(26) మృతి చెందిన కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు టెక్కలి సీఐ ఎ.విజయ్‌కుమార్ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పద్మనాభంను గోపినాథపురం సమీపంలో కొంత మంది వ్యక్తులు దాడిచేసి చంపేశారని అతని తల్లి 24వ తేదీన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోపినాథపురం గ్రామానికి చెందిన చితారు చంద్రశేఖర్, ధవళ నర్సింగరావు, ధవళ రాంబాబు, దుప్పట్ల మల్లేశ్వరరావు, ధవళ రామరాజులతో పాటు మరికొంత మంది వ్యక్తులు ముందస్తు ప్రణాళికతో పద్మనాభంను ఇనుపరాడ్లు, కర్రలతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడు చికిత్స పొందుతూ రిమ్స్‌లో మృతిచెందాడు. పద్మనాభంకు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో ఎవరిపై పడితే వారిపై దాడి చేసి గాయపరిచేవాడు. ఇతడితో ఎప్పటికై నా ప్రమాదం ఉందని భావించి నిందితులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.


