గుండెలు పగిలే వేదన
● సెప్టిక్ ట్యాంకులో పడి ఐదేళ్ల చిన్నారి మృతి
టెక్కలి రూరల్: కాసేపు పొలమారితేనే విలవిలలాడిపోతాం. అలాంటిది ఐదేళ్ల అబ్బాయి ఊపిరాడక ఎంత వేదన అనుభవించాడో. ఆపత్కాలంలో తల్లిని ఎంతగా తలచుకున్నాడో. తండ్రి వస్తాడని ఎంతగా ఎదురు చూశాడో..? ఐదేళ్ల వయసులోనే ఆయుష్షు తీరిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రుల గుండెలు ఎంతగా తల్లడిల్లిపోయాయో. స్థానిక మండపొలం కాలనీకి చెందిన కొంకి భవ్యాన్ (5) అనే చిన్నారి బుధవారం సెప్టిక్ ట్యాంకులో పడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండపొలం కాలనీకి చెందిన కొంకి హరిబాబు, మంగల చిన్న కుమారుడు భవ్యాన్. ఈ చిన్నారి ఒక ప్రైవేట్ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. అయితే బుధవారం తన ఇంటి సమీపంలో ఆడుకుంటూ ఇంటికి దగ్గరలో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు వెళ్లి ఆడుకుంటుండగా.. సెప్టిక్ ట్యాంక్ పై రేకు కప్పి ఉండటంతో దానిపైకి వెళ్లి ఒక్కసారిగా కిందకు జారి పడిపోయా డు. బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు అంతా గాలించారు. కాసేపయ్యాక సెప్టిక్ ట్యాంకులో పడి ఉన్న బాలుడిని గుర్తించారు. అనంతరం అతడిని బయటకు తీసి హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు.


