వణికిస్తున్న స్క్రబ్ టైఫస్
● జిల్లాలో ఎనిమిది మందికి వ్యాధి
● ఓ శిశువుకు కూడా సోకడంతో ఆందోళన
ఆందోళన వద్దు తగ్గిపోతుంది
జిల్లాలో ఈ వ్యాధిపై ఎలాంటి ఆందోళన వద్దు. లార్వల్ మైట్స్ అనే పురుగుల వల్ల ఈ వ్యాధి సోకుతుంది. అయితే స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకిన వారికి డోక్సిసైక్లిక్, ఎజిత్రామైసిన్ మందులను వినియోగిస్తే కచ్చితంగా వ్యాధి నియంత్రణలోకి వస్తుంది. ఇప్పటికే ఈ మేరకు వైద్యులకు సూచనలు ఇచ్చాం.
– డాక్టర్ కల్యాణ్‌బాబు, జిల్లా ఆసుపత్రుల సర్వీసుల కోఆర్డినేటర్
తగు చర్యలు చేపట్టాం
స్క్రబ్ టైఫస్ వ్యాధిని జిల్లాలోని హిరమండలంలో గుర్తించాం. ఎనిమిది మంది బాధితులు, ఒక శిశువు కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వ్యాధి సోకిన రోగుల పట్ల అన్ని చర్యలూ చేపడుతున్నాం. వ్యాధి లక్షణాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నాం. – కె.అనిత, డీఎంహెచ్‌ఓ
అరసవల్లి: స్క్రబ్ టైఫస్.. జిల్లాను కలవరపరుస్తున్న వ్యాధి. వాతావరణంలో మార్పులతో పా టు దూరపు ప్రయాణాలు చేసి వచ్చిన వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తుండడం ఆందోళనకరంగా మారింది. జిల్లాలో దాదాపు ఎనిమిది మంది ఈ వ్యాధి బారిన పడినట్లు సమాచారం. ఓ శిశువుకు కూడా వ్యాధి సోకడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే అధికారికంగా వ్యాధి గురించి సమాచారాన్ని ఎవరూ బయటకు ఇవ్వడం లేదు. చాలా మంది చికిత్స కోసం విశాఖకు పరుగులు తీస్తున్నట్లు తెలుస్తోంది.
వ్యాధి లక్షణాలివే..
● లార్వల్ మైట్స్ అనే పురుగులు కుట్టడం వల్ల ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుంది.
● చర్మం ఎరుపెక్కి దద్దుర్లు వస్తుంటాయి.
● ఈ వ్యాధి సోకిన తర్వాత దగ్గు, జ్వరం, జలుబు, నీరసం లక్షణాలు కనిపిస్తాయి.
● కొందరికి ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడంతో పాటు జ్వర తీవ్రత పెరిగిపోవడం, ఊపిరితిత్తుల సమస్యలు, రక్తం గడ్డకట్టడం, పచ్చకామెర్లు వంటి ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదాలున్నాయి.
● మెదడుపై ప్రభావం చూపకముందే ఈ వ్యాధి సోకిన వారిని వైద్యుల పరిశీలనలో ఉంచడం మంచిది.
పెరుగుతున్న కేసులు
జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలు మండలాల్లో వారం రోజుల్లోనే ఏడు కేసులు నమోదు కావడంతో పాటు ఓ తొమ్మిది నెలల శిశువు కూడా ఈ వ్యాధి సోకడం ఆందోళనకరంగా మారింది.
వణికిస్తున్న స్క్రబ్ టైఫస్


