మిల్లర్ల ఇష్టారాజ్యం
● అదనంగా ధాన్యం ఇవ్వాల్సిందేనంటూ హుకుం
● అధికారులకు ఫిర్యాదు చేసినా వెరవని మిల్లర్లు
నరసన్నపేట: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కంబకాయకు చెందిన రైతు సెరిశిల్ల సింహాచలం కంబకాయ కొనుగోలు కేంద్రం ద్వారా బుధవారం 50 బస్తాల ధాన్యం ఉదయం 9 గంటలకు నరసన్నపేటలోని బాలాజీ రైస్‌మిల్లుకు తీసుకువెళ్లాడు. ధాన్యం పరిశీలించిన మిల్లరు నాణ్యత బాగులేదు 80 కేజీల బస్తాకు అదనంగా 6 కిలోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బస్తాకు ఆరు కిలోలు అంటే 50 బస్తాలకు 300 కిలోలు మిల్లరు అప్పనంగా అడగడంతో రైతులు ఆందోళనకు దిగారు. స్థానిక సివిల్ సప్లై డీటీ రామకృష్ణకు సమాచారం ఇచ్చారు. ఈయన వచ్చి మిల్లర్‌తో మాట్లాడినా ప్రయోజనం లేకపోయింది. అక్క డి నుంచి రైతు ధాన్యం పట్టుకొని తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ టి.సత్యనారాయణకు విషయం తెలియజేశారు. తానేమీ చేయలేనని ఆయన చేతులెత్తేశారు. దీంతో చేసేదేమీ లేక రైతు ధాన్యాన్ని తిరిగి ఇంటికి తీసుకొని వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా కంబకాయకు చెందిన రైతులు తంగి రవీంద్ర, పాగోటి అప్పలనాయుడు మాట్లాడుతూ మిల్లర్ల దోపిడీని అరికట్టాలని కోరారు. ప్రతి బస్తాకు రెండు కిలోలు అదనంగా తీసుకుంటున్నారని, ఇది కాకుండా మరో నాలుగైదు కిలోలు నాణ్యత పేరున తీసుకుంటున్నారని తెలిపారు. కొందరు రైతులు చేసేదేమీ లేక ఇచ్చేస్తుండగా కొంత మంది రైతులు ఎదురు తిరిగినా ఫలితం లేకుండా పోతుంది. బస్తాకు 2 కిలోలు అదనంగా ఇస్తే మండలంలో రైతులు ఈ సీజన్‌కు రూ. 2.5 కోట్లు మేర నష్ట పోయే అవకాశముంది.


