ఒకటో తరగతికి 8 పేజీలా?
శ్రీకాకుళం : ఇటీవల జరిగిన సమ్మెటివ్ పరీక్షల్లో ఒకటి రెండు తరగతులు చదువుతున్న చిన్నారులకు ప్రశ్నపత్రంగా 8 పేజీల బుక్‌లెట్‌ను ఇవ్వడాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. 6,7 ఏళ్ల వయసున్న వీరికి ఈ ప్రశ్నపత్రాన్ని నింపడం తలకుమించిన భారమని, ఇటువంటి ఆలోచనలు రాష్ట్రస్థాయిలో ఉన్నవారికి ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నపత్రాన్ని దిద్దడానికే ఒక్కో ఉపాధ్యాయునికి 15 నిమిషాలకు పైగా పడుతోందని, అటువంటిది చిన్నారులు రెండున్నర గంటల్లో 8 పేజీల ప్రశ్నపత్రానికి జవాబులు ఎలా రాయగలుగుతారని ప్రశ్నిస్తున్నారు. గతంలో వీరికి 50 మార్కులకు పరీక్ష నిర్వహించే వారని ఇప్పుడు దానిని కూడా కాదని 80 మార్కులకు ప్రశ్నల రూపంలోనూ, మిగిలిన 20 మార్కులు అసైన్‌మెంట్ రూపంలోనూ నిర్వహించడాన్ని ఉపాధ్యాయ వర్గాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తప్పుపడుతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ ఇటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.


